పంచాయతీ తాళం పగలగొట్టి దుకాణం తెరిచిన వైనం

పంచాయతీ తాళం పగలగొట్టి దుకాణం తెరిచిన వైనం

దౌల్తాబాద్‌, సిద్దిపేట:  మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో కిరాయి బకాయిల వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారింది. కిరాయి బకాయిలు చెల్లించకపోవడంతో గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజగోపాల్‌ ఆధ్వర్యంలో సిబ్బంది సంబంధిత దుకాణానికి తాళం వేశారు. అయితే సదరు దుకాణదారు బకాయిలు చెల్లించకుండానే పంచాయతీ సిబ్బంది వేసిన తాళాన్ని పగలగొట్టి దుకాణాన్ని తెరిచినట్లు తెలిసింది. కాంప్లెక్స్‌లోని దుకాణాలకు సంబంధించి కొంతకాలంగా కిరాయి బకాయిలు పేరుకుపోయినట్లు గ్రామ పంచాయతీ వర్గాలు పేర్కొంటున్నాయి. బకాయిలు చెల్లించాలని పలుమార్లు సూచించినప్పటికీ స్పందన లేకపోవడంతో నిబంధనల ప్రకారం సంబంధిత దుకాణానికి పంచాయతీ సిబ్బంది తాళం వేసినట్లు సమాచారం. పంచాయతీ అధికారులు తీసుకున్న చర్యను పట్టించుకోకుండా తాళం పగలగొట్టి దుకాణాన్ని తెరవడం చర్చనీయాంశంగా మారింది.

అధికారుల చర్యకు సవాల్‌?

గ్రామ పంచాయతీ ఆధీనంలోని ఆస్తికి సంబంధించిన బకాయిల వసూళ్లలో భాగంగా అధికారులు తాళం వేసిన అనంతరం దానిని పగలగొట్టడం పంచాయతీ అధికారుల చర్యను ధిక్కరించినట్లుగా స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పంచాయతీ ఆస్తులకు సంబంధించిన నిబంధనలు, అద్దె ఒప్పందాలను ఉల్లంఘించినట్లయితే అధికారులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే దౌల్తాబాద్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్వహణ, కిరాయి బకాయిలు, దుకాణాల వినియోగంపై పలు సందర్భాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా తాళం పగలగొట్టిన ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. పంచాయతీకి రావాల్సిన కిరాయి బకాయిలను పూర్తిగా వసూలు చేసి, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Views: 393

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News