లోవోల్టేజీతో మోటార్లు దగ్ధం.. ఎండిపోతున్న పంటలు
- సిరిసిల్ల–నిమ్మపల్లి రహదారిపై రైతుల రాస్తారోకో
కోనరావుపేట,:వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ సరఫరా చేయడం లేదని, లోవోల్టేజీ సమస్యతో మోటార్లు కాలిపోతు న్నాయని ఆరోపిస్తూ ధర్మారం గ్రామ రైతులు రోడ్డెక్కారు. కాలిపోయిన వ్యవసాయ బోరు మోటార్‌ను రోడ్డుపై ఉంచి సిరిసిల్ల–నిమ్మపల్లి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఒక ట్రాన్స్‌ఫార్మర్‌కు రోజు మార్చి రోజు విద్యుత్ సరఫరా చేస్తుండటంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లోవోల్టేజీ కారణంగా మోటార్లు తరచూ కాలిపోతున్నాయని, తీవ్రంగా నష్టపోతున్నామని విద్యుత్ అధికారులను నిలదీశారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, విద్యుత్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


