ప్రతి మారుమూల ప్రాంతానికీ మెరుగైన కమ్యూనికేషన్ సౌకర్యాలు కల్పించాలి
- జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రతి మారుమూల ప్రాంతానికి మెరుగైన కమ్యూనికేషన్ సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో బీఎస్ఎన్ఎల్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, నల్లమల్ల అటవీ ప్రాంతంతో పాటు జిల్లా వ్యాప్తంగా కమ్యూనికేషన్ నెట్ వర్క్ విస్తరణకు చర్యలు చేపట్టాలని సూచించారు. నల్లమల్ల, కలెక్టరేట్, మారుమూల ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ శాచ్యురేషన్ మోడ్స్ ఏర్పాటు చేయాలని, అవసరమైన ప్రాంతాల్లో కొత్త సెల్ ఫోన్ టవర్ల ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. టవర్ల ఏర్పాటుకు అవసరమైన భూమి, అనుమతుల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.నల్లమల్లలో టవర్ల ఏర్పాటుతో వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అటవీ శాఖ నిబంధనలు, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ టవర్లకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే చెంచు గిరిజనులకు మెరుగైన నెట్ వర్క్ సేవలు అందించడం ద్వారా ప్రభుత్వ, డిజిటల్, అత్యవసర సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయని కలెక్టర్ పేర్కొన్నారు.అటవీ, రెవెన్యూ శాఖలు బీఎస్ఎన్ఎల్ అధికారులతో సమన్వయం చేసుకుని పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రా, జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


