వ్యవసాయ పొలాల్లో అక్రమంగా గంజాయి సాగు – ఇద్దరిపై కేసు నమోదు
- రూ.38.50 లక్షల విలువ గల, 385 గంజాయి మొక్కలు స్వాధీనం
- గంజాయి పండించిన, సేవించిన, వ్యాపారం చేసిన, రవాణా చేసిన కఠిన చర్యలు తప్పవు.
- గంజాయి పండించిన రైతులకు ప్రభుత్వ పథకాలు రాకుండా సిఫార్సు.
- గంజాయి పై సమాచారం అందించిన వారికి నగదు బహుమతి, రివార్డులు
- జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్ :జిల్లా వ్యాప్తంగా గంజాయి నిర్మూలనకు జిల్లా పోలీస్ యంత్రాంగం కృషి చేస్తుందని అందులో భాగంగానే ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొటంలొద్ది గ్రామ శివారులో వ్యవసాయ పొలాల్లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి మొత్తం 385 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలియజేశారు. గురువారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పొట్టం లొద్ది గ్రామంలో రూ 38.50 లక్షల విలువ చేసే 385 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని ఇద్దరిపై రెండు కేసులు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో వివరాలను వెల్లడించారు. మొదటి ఘటనలో పొటంలొద్ది గ్రామానికి చెందిన మెస్రం గంగారాం పటేల్ వ్యవసాయ పొలంలో తనిఖీలు నిర్వహించగా 315 గంజాయి మొక్కలు గుర్తించారు. వ్యవసాయ విస్తరణ అధికారి పరిశీలించి అవి గంజాయి మొక్కలేనని నిర్ధారించగా, వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మొక్కల విలువ సుమారు రూ.31.50 లక్షలు. అదే సమయంలో మరో వ్యవసాయ పొలంలో మెస్రం నాగు గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించి తనిఖీలు చేపట్టగా 70 గంజాయి మొక్కలు లభించాయి. వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.7 లక్షలు అంచనా వేశారు.రెండు ఘటనల్లోనూ నిందితులు సంఘటనా స్థలంలో లభించకపోవడంతో పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
నిందితులు:
1. మెస్రం గంగారాం పటేల్ – పొటంలొద్ది గ్రామం.
2. మెస్రం నాగు – పొటంలొద్ది గ్రామం.
ఈ దాడుల్లో ఆదిలాబాద్ రూరల్ సి ఐ రహీం పాషా, ఎస్ ఐ వి. విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
అదేవిధంగా గంజాయి వ్యాపారం చేసిన, రవాణా చేసిన, సేవించిన, విక్రయించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత గంజాయి అలవాటుతో వ్యసనానికి గురైన వారికి తల్లిదండ్రులు జిల్లా పోలీసు యంత్రాంగానికి తెలియజేసినట్లయితే వారిని డి అడిక్షన్ సెంటర్లకు తరలించి చికిత్స అందించడం జరుగుతుందని హామీ ఇచ్చారు.గంజాయి జీవితాలను నాశనం చేస్తుంది అని మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జిల్లా పోలీసులు చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ పాల్గొంటూ గంజాయికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా జిల్లా ఎస్పీ గారిచే నిర్వహించబడుతున్న 8712659973 నెంబర్ కు వాట్సప్ ద్వారా సమాచారం అందించవచ్చని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 250 ఎకరాలకు సంబంధించిన వ్యవసాయ భూములలో గంజాయి పండించిన వారికి ప్రభుత్వ పథకాలు రాకుండా సిఫార్సు చేయడం జరిగిందని గుర్తు చేశారు. గంజాయి పై సమాచారం అందించిన వారికి నగదు బహుమతిని అందించి అభినందించడం జరుగుతుందని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, రూరల్ సీఐ రహీం పాషా, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, రూరల్ ఎస్సై వి విష్ణువర్ధన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


