గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

ప్రశాంత వాతావరణంలో ఉత్సవం జరిగేలా చర్యలు తీసుకోవాలి:*జిల్లా కలెక్టర్ రాజర్షిషా

ఆదిలాబాద్ జిల్లా : గణేష్ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ అఖిల్ మహాజన్‌, మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్ లతో కలిసి వివిధ శాఖల అధికారులతో నిమజ్జన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన నిమజ్జన ఘాట్లు, భక్తుల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, భద్రత తదితర అంశాలపై శాఖల వారీగా సమీక్షించారు. భోరాజ్ పెన్‌గంగా నది, గ్రామీణ ప్రాంతంలోని చందా వాగు వద్ద నిమజ్జన ఘాట్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రధాన ఘాట్ల వద్ద భారీ క్రేన్లు, విద్యుత్ దీపాలు, జనరేటర్లు ఏర్పాటు చేయాలని, అవసరమైన ప్రాంతాల్లో అదనపు లైటింగ్ కల్పించాలని సూచించారు. నీటి ప్రవాహం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు అనుభవజ్ఞులైన ఈతగాళ్లు, లైఫ్‌జాకెట్లు, బోట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. విగ్రహాలను తరలించే వాహనాలకు ఇబ్బందులు కలగకుండా రాకపోకల మార్గాలను ముందుగానే గుర్తించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, చెత్త తొలగింపు, తాగునీరు, వైద్య సిబ్బంది, అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. నిమజ్జనోత్సవం పూర్తయ్యే వరకు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన సిబ్బంది, పరికరాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు అధికారులకు సహకరించి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకుని పెన్‌గంగా నది తీరం, చందా వాగు ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారుల్లో విస్తృత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించడంతో పాటు గస్తీ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిమజ్జన ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెన్‌గంగా ప్రాంతం సరిహద్దు ప్రాంతం కావడంతో అంతర్రాష్ట్ర రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వివరించారు. నిమజ్జనోత్సవం సందర్భంగా ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు, ఇతర శాఖల అధికారులకు సహకరించాలని ఎస్పీ కోరారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, అనూష, డీఎస్పీ జీవన్, ఆర్టీవో జగదీశ్వర్‌రావు, రెవెన్యూ, పోలీసు, నీటిపారుదల, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News