ఆలయాలను మింగేస్తున్న భూ బకాసురులు.. కోట్లాది విలువైన స్థలం కబ్జా...!!
- మరోమారు తెరపైకి ఎల్లమ్మ ముత్యాలమ్మ దేవాలయాల స్థలం..

ఆ స్థలాన్ని వదులుకొనే ప్రసక్తే లేదంటున్న గ్రామస్తులు..!
జనగామ : జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ కు ఆనుకొని ఉన్న కోట్లాది రూపాయల విలువైన ఎల్లమ్మ దేవాలయ గుడి ప్రాంగణం ఆది నుండి పలు వివాదాలకు దారితీస్తోంది. సర్వే నంబర్ 316లోని 16 గుంటల భూమిని పూర్వపు పట్టాదారులు గ్రామ అభివృద్ధికి దారాదత్తం చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. దీని ఆధారంగా దివంగత సర్పంచ్ డుకిరే శంకర్రావు, అప్పటి కారోబార్ దోర్నాల మనోహర్, గ్రామానికి చెందిన వివిధ కుల సంఘాల పెద్దల నేతృత్వంలో ఈ స్థలాన్ని గ్రామాభివృద్ధికి వినియోగించాలని భావించి ఇక్కడ బాల వికాస స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఒక వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఆ తరువాత అదే స్థలంలో నాగుపాము ఆకారంలో పెద్ద ఎత్తున పుట్టలు మొలిచాయి. దీన్ని గుర్తించిన స్థానికులు "ఇది ఎల్లమ్మ దేవుడి మహిమ" అని ఇక్కడ ఆమె పేరుతో దేవాలయం నిర్మించాలని శివసత్తులు పూనకాలు ఊగుతూ నిత్యం పూజలు చేయడం ప్రారంభించారు. ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న సీనియర్ పాత్రికేయులు, ప్రస్తుత 'విజన్ ఆంధ్ర' దినపత్రిక జనగామ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కొలుపుల రవి గుర్తించి భక్తుల విశ్వాసాన్ని దినపత్రికలో 'పెరుగుతున్న పుట్టలు... తరలుతున్న భక్తులు' అనే శీర్షికన ప్రముఖంగా వార్త కథనాన్ని ప్రచురించడం జరిగింది. దీంతో ఆ స్థలానికి మరింత ప్రాముఖ్యత చేకూరింది. దీన్ని నిశితంగా గమనించిన స్థానిక కుల సంఘాల పెద్దలు ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి భక్తుల విశ్వాసం మేరకు ఎల్లమ్మ, ముత్యాలమ్మ దేవాలయాలను నిర్మించారు.
ఆ విధంగా ఆలయ ప్రాంగణంలో ఈ రెండు దేవాలయాలు పూజలు అందుకుంటూ ఉంటున్న క్రమంలో 2002లో ప్రస్తుతం ఓ జాతీయ పార్టీలోని పేరు చివరన రెడ్డి అనే చోటా నాయకుడు రియల్ వ్యాపారం మొదలుపెట్టి, ఖాళీగా ఉన్న ఈ భూమిపై కన్నేసి మండల స్థాయి ప్రజాప్రతినిధితో జతకట్టి పొరుగు గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ఈ భూమికి వారసుడిగా సృష్టించినట్లు సమాచారం. అదేమిటంటే పూర్వం ఈ భూమిని ధారా దత్తం చేసిన దాత ఇంటి పేరు, పొరుగు గ్రామానికి చెందిన వ్యక్తి ఇంటిపేరు ఒకటే కావడంతో ఈ భూమికి వారసునిగా ఈ ముగ్గురు కలిసి నకిలీ పత్రాలు సృష్టించారని ప్రచారం జరుగుతుంది. ఇందుకు అప్పటి తహసిల్దార్ కు నయానో భయానో ఇచ్చి పట్టాదారు పాస్ పుస్తకాలు పుట్టించి, ఆ పాసుబుక్కు, పహనీలను చూపించి జనగామ సబ్ రిజిస్టర్ సహకారంతో నకిలీ రిజిస్ట్రేషన్ డీడ్ పత్రాలు సృష్టించడం జరిగిందని తెలుస్తుంది. ఈ ముగ్గురు ఇంతటితో ఆగకుండా ఈ విషయాన్ని మరో లీడర్ చెవిలో వేసి అతనికి కూడా ఇందులో వాటా ఇస్తామని నమ్మించి ఇబ్బందులు పెట్టకుండా ఎర వేశారు. ఆ తరువాత రూ. 30 లక్షలకు ఓ మాజీ ప్రజా ప్రతినిధి అయిన రౌడీ షీటర్ కు అమ్మేసేందుకు సిద్ధపడ్డారు. సదరు రౌడీషీటర్ కూడా ఈ భూమిని కొనుగోలు చేసేందుకు అంగీకరించి సూత్రధారులైన ముగ్గురికి అడ్వాన్స్ కింద రూ.10 లక్షలు ముట్ట చెప్పాడని సమాచారం. మార్కెట్ డిమాండ్ ను పసిగట్టిన సదరు రౌడీషీటర్ వేరే గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యాపారులకు 80 గజాల చొప్పున రెండు ప్లాట్లు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుని వారి నుండి అడ్వాన్సుగా రూ. 30 లక్షలు తీసుకొని సూత్రధారుకు ఇచ్చినట్లు సమాచారం. ఆ తరువాత సదరు రౌడీషీటర్ అక్కడ ఉపాధి పొందుతున్న డబ్బాలను ఖాళీ చేయించే ప్రయత్నం చేశాడు. కాగా, చిరు దుకాణాలను ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్న పలువురు ఈ భూమి తనదేనని, ఎన్నో ఏళ్లుగా ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటున్నామని, ఖాళీ చేసే ప్రసక్తే లేదని కోర్టును ఆశ్రయించారు.

అప్పుడు మొదలైన ఈ భూవివాదం ఇప్పటికీ రావణ కాస్టంలా రగులుతూనే ఉంది.ఒక దశలో స్థానిక పాత్రికేయులను కొందరిని మచ్చిగ చేసుకునే ప్రయత్నం కూడా జరిగింది. ఇదిలా ఉంటే గతేడాది గ్రామంలో దుర్గమ్మ పండుగ నిర్వహించే క్రమంలో మరోసారి ఈ భూవివాదం తెరపైకి వచ్చింది. ఆ సమయంలో చిరు వ్యాపారులందరికి ఉత్సవ కమిటీ సభ్యులు నచ్చజెప్పి పండుగ నిర్వహణ సహకరించాలని, దుకాణాలను తాత్కాలికంగా ఖాళీ చేసి, పండుగ తర్వాత తిరిగి యధావిధిగా వేసుకోవచ్చు సూచించారు. దీంతో మెజార్టీ చిరు వ్యాపారులు వారి దుకాణాలను తొలగించారు. కొందరు మాత్రం తాము తొలగించే ప్రసక్తే లేదని, డబ్బాలను తొలగిస్తే నకిలీ పత్రాలతో ఈ స్థలాన్ని అమ్మాలని చూస్తున్నారని భీష్మించుకుని కూర్చున్నారు. ఆ తర్వాత పోలీస్, రెవిన్యూ, ట్రాన్స్కో అధికారుల సహకారంతో పండుగను గ్రామస్తులు సజావుగా నిర్వహించారు. ఇదే అదనుగా భావించిన కొందరు ఖాళీగా ఉన్న ఈ భూమి తనదేనని చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగ చూపించి, పోలీసు,రెవెన్యూ అధికారులకు ఆశచూపి ఆ కబ్జా చేసేందుకు పూనుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు వీరు అప్పట్లో ఓ మంత్రి పేరు కూడా తెగ వాడేసుకున్నమాట నిజం. అప్పటినుండి స్తబ్దంగా ఉన్న ఈ వివాదం మళ్లీ సోమవారం ఒక్కసారిగా రగులుకుంది. అక్కడికి విచారణ కోసం వచ్చిన ఆర్ఐ శరత్ తో గ్రామస్తులు వాగ్వివాదానికి దిగారు. ఈ భూమి గ్రామానికి సంబంధించినది, గ్రామ అవసరాలకు ఉపయోగిస్తాం, ఎవరో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేయాలని చూస్తే తాము సహించేది లేదు, దయచేసి అధికారులు కూడా గ్రామ ప్రజలకు సహకరించాలంటూ విజ్ఞప్తి చేశారు. దీంతో ఆర్.ఐ అక్కడి నుండి నిష్క్రమించారు. గ్రామ ప్రజల అవసరాలకు ఉపయోగపడే ఈ స్థలాన్ని కొందరు కబ్జాకోరులు విక్రయించి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారని, దీన్ని గ్రామ అవసరాలకే దక్కేలా కమిటీ ఏర్పాటు చేసి అన్ని శాఖల అధికారులను కలిసి కృషి చేస్తామని గ్రామస్తులు అంటున్నారు. చూడాలి మరి ఈ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఇంకెప్పుడూ దీనికి ముగింపు పలుకుతుందో....!
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Related Posts

