ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఘనంగా వాడబలిజ జెండా ఆవిష్కరణ
వాడబలిజ కులస్తులకు ప్రభుత్వాలు తగిన గుర్తింపు కల్పించి న్యాయం చేయాలి – రాష్ట్ర అధ్యక్షులు దామోదర్
వెంకటాపురం : ములుగు జిల్లా, వెంకటాపురం మండల కేంద్రంలోని వి.ఆర్.కె. పురం గ్రామపంచాయతీ పరిధిలో ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని వాడబలిజ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. వాడబలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దామోదర్, రాష్ట్ర అధికార ప్రతినిధి తోట మల్లికార్జున రావు ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులందరికీ వారు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతానికి ఇరువైపులా అధిక సంఖ్యలో నివసిస్తున్న వాడబలిజ కులస్తులను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. లక్షలాది జనాభా కలిగిన వాడబలిజ కులస్తులకు ప్రభుత్వాల నుంచి తగిన గుర్తింపు, ప్రాధాన్యత లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.బ్రిటిష్ పాలనకు పూర్వం నుంచే ఈ ప్రాంతంలో వందల సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తున్న వాడబలిజ కులస్తులకు ఇప్పటికీ సరైన గుర్తింపు లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు తమను కేవలం ఓటర్లుగా మాత్రమే చూడకుండా, తమ సామాజిక పరిస్థితులను గుర్తించి, తగిన గుర్తింపు కల్పించడంతో పాటు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొప్పుల మల్లయ్య, వాధం వెంకన్న, సనుగుండ వెంకన్న, బోగట నరసింహారావు, కొప్పుల మల్లికార్జున్, సారయ్య, సూర్యం, వెంకటేష్, రమేష్, పోతురాజు, విజయ్, నాగార్జున, ప్రసాదు, రవిచంద్రమూర్తి, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


