సాలూర జడ్పీహెచ్ఎస్లో ఘనంగా మాక్ పార్లమెంట్
నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు – ఎంఈఓ రాజీ మంజుష
సాలూర: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాలూరలో శనివారం మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని విద్యార్థులు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రధానమంత్రి, స్పీకర్, మంత్రులు, ప్రతిపక్ష నాయకుల పాత్రలను పోషిస్తూ పార్లమెంట్ సమావేశాలను నిర్వహించారు. ప్రజారోగ్యం, ప్రభుత్వ ఆసుపత్రుల స్థితిగతులు, విద్యా ప్రమాణాలు, పాఠశాలల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఎల్నినో ప్రభావం తదితర అంశాలపై విద్యార్థులు ప్రశ్నలు లేవనెత్తగా, సంబంధిత మంత్రుల పాత్రలు పోషించిన విద్యార్థులు సమాధానాలు ఇచ్చారు. విద్యార్థులకు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రత్యక్ష అవగాహన కల్పించడం, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య విధానాలు, ప్రశ్నించే తత్వం, ప్రతిపక్ష పాత్ర, నాయకత్వ లక్షణాలు, వాక్చాతుర్యం, ఆత్మవిశ్వాసం, చర్చలు, సంప్రదింపుల నైపుణ్యాలను పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి శ్రీమతి రాజీ మంజుష మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, విద్యార్థులు చదువుతో పాటు సమాజం, దేశ పాలన, ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థులు వివిధ పాత్రలను సమర్థవంతంగా పోషించడం అభినందనీయమని కొనియాడుతూ వారిని అభినందించారు. ఈ కార్యక్రమానికి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు దండు రాజ్ కుమార్, బగారే లక్ష్మి సారథ్యం వహించగా, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి రాజీ మంజుష సూత్రప్రాయంగా మార్గనిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్తో పాటు గంధం సాయిలు, సంగీత్ రావు, అబ్బయ్య, జ్యోత్స్న, విజయలక్ష్మి, స్వర్ణలత, మేడి రవి, అక్షయ్ కుమార్ జాదవ్, అంజన, విక్రమ్, శ్రీకాంత్ రెడ్డి, యశశ్రీ, సునీత, హనుమాన్లు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


