అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి

ఆదిలాబాద్ పట్టణంలో సుమారు 3 వేల మందికి కొత్త చేయూత పింఛన్లు.. జిల్లావ్యాప్తంగా 14,549 మంది అర్హుల గుర్తింపు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో తొలిరోజే 5,536 కుటుంబాల నమోదు

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి


ఆదిలాబాద్ బ్యూరో : అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించి ఆర్థిక, సామాజిక భద్రత కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి అన్నారు. గతంలో వివిధ కారణాలతో పింఛన్లు పొందలేక ఇబ్బందులు పడుతున్న అర్హులను గుర్తించి కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని ఎస్‌టీయూ భవన్ హాల్‌లో గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను ఆలపించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో వివిధ కారణాలతో పింఛన్లు అందక ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలను గుర్తించేందుకు ప్రత్యేక సర్వే నిర్వహించినట్లు తెలిపారు. పింఛన్ల కోసం దరఖాస్తులను పరిష్కరించి అర్హులకు పింఛన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా పింఛన్ కోసం ఎదురుచూస్తున్న పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఏ శాఖలోనైనా ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే వాటిని గుర్తించి సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించినప్పుడే ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు.
గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు ప్రభుత్వం కార్డులు మంజూరు చేస్తోందన్నారు. పేదలకు సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గృహ వినియోగానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో రాజకీయ వివక్షకు తావులేకుండా అర్హులందరికీ ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.
మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, డ్వాక్రా మహిళలు కుట్టే పాఠశాల యూనిఫాంలకు గతంలో మీటరుకు రూ.50 చెల్లించగా ప్రస్తుతం రూ.75కు పెంచినట్లు తెలిపారు. భవిష్యత్తులో మహిళలకు నాణ్యమైన చీరలు, పిల్లలకు దుస్తులు అందించే చర్యలు చేపడతామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నతంగా చదివించాలని, విద్య ద్వారానే కుటుంబాలు, సమాజం అభివృద్ధి చెందుతాయని సూచించారు.
జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఆదేశాల మేరకు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పింఛన్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో కొత్త పింఛన్ల కోసం సుమారు 15 వేల దరఖాస్తులు అందగా, క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి 14,549 మంది అర్హులను గుర్తించినట్లు వెల్లడించారు.
దివ్యాంగులకు సదరం ధ్రువపత్రాలు అందించేందుకు జిల్లావ్యాప్తంగా 28 ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. కొన్ని ధ్రువపత్రాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, వాటి పరిష్కారానికి మరో వారం నుంచి 15 రోజుల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి అర్హులందరికీ ధ్రువపత్రాలు అందజేస్తామన్నారు. పెండింగ్ ప్రక్రియను పూర్తి చేసి వచ్చే నెల నుంచి అర్హులకు పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని జిల్లాలో ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 80 నమోదు శిబిరాలు ఏర్పాటు చేయగా, తొలిరోజే 5,536 కుటుంబాలను నమోదు చేసినట్లు వెల్లడించారు. కుటుంబ యజమాని మరణించిన సందర్భంలో నామినీలకు రూ.5 లక్షల బీమా పరిహారం అందేలా ఈ పథకాన్ని రూపొందించినట్లు వివరించారు.
ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోనూ నాలుగు శిబిరాలను ప్రారంభించి విడతలవారీగా అన్ని వార్డులు, కాలనీల్లో నమోదు ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వార్డు అధికారులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, వార్డు కౌన్సిలర్లు, సూపర్‌వైజర్ల సమక్షంలో నమోదు చేపడుతున్నామన్నారు. అర్హులైన కుటుంబాలు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ నంబరుతో పాటు కుటుంబ యజమాని, నామినీ వివరాలను నమోదు కోసం తీసుకురావాలని సూచించారు. బీమా మొత్తంలో నామినీలకు కేటాయించాల్సిన వాటాలను కూడా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. నమోదు పూర్తయిన అనంతరం సంబంధిత మొబైల్ నంబరుకు ట్రాన్సాక్షన్ ఐడీ సందేశం వస్తుందని వివరించారు.
ఎన్నికల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వం ప్రజలందరిదని, ఓటు వేసిన వారితో పాటు ఓటు వేయని వారికి కూడా సమానంగా సేవ చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రథమ కర్తవ్యమన్నారు.
భర్తను కోల్పోయిన మహిళలు, దివ్యాంగులు, తలసేమియా బాధితులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ చేయించుకుంటున్న నిరుపేదలు ఎదుర్కొంటున్న ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఎంతో బాధాకరమన్నారు. ఇలాంటి వారికి పింఛన్ ఎంతో అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. గత ఏడెనిమిదేళ్లుగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న సుమారు నాలుగున్నర లక్షల మంది అర్హులకు పింఛన్లు మంజూరు కావడం సంతోషకరమన్నారు. పింఛన్ కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదని, వృద్ధులు, దివ్యాంగులు, అభాగ్యులు ఆత్మగౌరవంతో జీవించేందుకు కల్పించే భరోసా అని అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో చర్చ జరిగినప్పటికీ, పేదల కష్టాలు, అవసరాలను దృష్టిలో ఉంచుకొని అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాల్సిన అవసరాన్ని సభలో ప్రస్తావించినట్లు తెలిపారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అన్నారు.
ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి, మంత్రులు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ప్రధానమంత్రిని కలిసి నియోజకవర్గానికి అవసరమైన నిధులు, అభివృద్ధి పనుల కోసం కృషి చేస్తున్నట్లు పాయల్ శంకర్ తెలిపారు. ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటు, పారిశ్రామిక పార్కు అభివృద్ధి వంటి కీలక అంశాల సాధనకు నిరంతరం ప్రయత్నిస్తున్నానన్నారు.
జిల్లాకు పరిశ్రమలు వస్తే యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఆర్థికాభివృద్ధికి బాటలు పడతాయని పేర్కొన్నారు. తనపై ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోనని, ఆదిలాబాద్ అభివృద్ధి చెందడం, ప్రజల జీవితాల్లో మార్పు రావడమే తనకు ముఖ్యమన్నారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేస్తే జిల్లాను అభివృద్ధిలో ముందంజలో నిలపవచ్చన్నారు. ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యాలుగా నిరంతరం పనిచేస్తానని స్పష్టం చేశారు.
మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ.. భర్తలను కోల్పోయి, ఆర్థిక ఇబ్బందులతో ఏళ్లుగా పింఛన్ కోసం ఎదురుచూస్తున్న నిరుపేద మహిళలకు చేయూత పింఛన్లు ఎంతో ఆసరాగా నిలుస్తాయని అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో సుమారు మూడు వేల మందికి కొత్త పింఛన్లు మంజూరు కావడం సంతోషకరమన్నారు.
పట్టణంలో ఇంకా అనేక నిరుపేద కుటుంబాలు సొంత ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాయని, ఇప్పటివరకు ఇళ్లు పొందని అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని ప్రభుత్వ పెద్దలను కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వారి అవసరాలకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు. పేదల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అనంతరం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో నమోదు చేసుకున్న లబ్ధిదారులకు అతిథులు పథకం బ్రోచర్లను అందజేశారు. చేయూత పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ మల్లెపూల నరసయ్య, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్బిన్ అందన్, ఆత్మ చైర్మన్ సంతోష్, అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్ర, ఆర్డీఓ జగదీశ్వర్ రావు, డీఆర్‌డీఏ పీడీ రాథోడ్ రవీందర్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, వార్డు కౌన్సిలర్లు, సర్పంచులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ
భువనగిరి :  రమణేశ్వరంలో ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ హిందీ గ్రంథావిష్కరణ వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులలోని జ్ఞానాన్ని స్వీయ ఆధ్యాత్మిక అనుభూతులతో మేళవించి సిద్ధగురు శ్రీ రమణానంద...
పట్టణాల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు.. స్వాగతం
హెచ్ఐవి నియంత్రణలో జిల్లాకు సురక్షిత గుర్తింపు
ఆధ్యాత్మికతతో శాంతిని నెలకోల్పాలి
59వ గ్రంథాలయ వారోత్సవాల్లో బిట్స్ జయకేతనం
మద్యం మత్తులో పొలంలో పడి వ్యక్తి మృతి
జీవితభీమా పధకానికి నమోదు చేసుకోవాలి