తెలంగాణ గ్రామీణ బ్యాంకు లో పనిచేయని ప్రింటర్.. ఖాతాదారుల కు తప్పని తిప్పలు

ఏడాదిగా ఇదే పరిస్థితి.. ఇబ్బందులు పడుతున్న గ్రామీణ పేదలు, నిరక్షరాస్యులు – పట్టించుకోని ఉన్నతాధికారులు?

తెలంగాణ గ్రామీణ బ్యాంకు లో పనిచేయని ప్రింటర్..  ఖాతాదారుల కు తప్పని తిప్పలు

ధర్మసాగర్:   ధర్మసాగర్ మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పాస్‌బుక్ ప్రింటర్ పనిచేయకపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేదలు, నిరక్షరాస్యులు తమ బ్యాంకు ఖాతాల్లోని లావాదేవీల వివరాలు తెలుసుకునేందుకు పాస్‌బుక్ ప్రింటింగ్ కోసం బ్యాంకుకు వస్తుండగా, ప్రింటర్ పనిచేయడం లేదనే సమాధానం ఎదురవుతోంది.

గత సంవత్సరం నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులో ఖాతా వివరాలు నమోదు చేయించుకోవాలని, నగదు జమలు, ఉపసంహరణల వివరాలను తెలుసుకోవాలని వచ్చే సామాన్య ప్రజలకు పాస్‌బుక్ ప్రింటింగ్ అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

ముఖ్యంగా చదువురాని వృద్ధులు, పేదలు తమ ఖాతాల్లో ఎంత నగదు ఉంది? ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాల డబ్బులు జమయ్యాయా? నగదు జమలు, ఉపసంహరణలు సక్రమంగా నమోదయ్యాయా? అనే వివరాలను తెలుసుకోవడానికి పాస్‌బుక్‌పై ఆధారపడుతున్నారు. ప్రింటర్ పనిచేయకపోవడంతో వారు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఈ సమస్యపై బ్యాంకు సిబ్బంది ఇప్పటికే ఉన్నతాధికారులకు సమాచారం అందించినప్పటికీ, ఇప్పటివరకు ప్రింటర్ సమస్య పరిష్కారం కాలేదని ఖాతాదారులు పేర్కొంటున్నారు. ఏడాది కాలంగా ప్రింటర్ మరమ్మతులు చేయించకపోవడం లేదా కొత్త ప్రింటర్ ఏర్పాటు చేయకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

బ్యాంకింగ్ సేవలు సామాన్య ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండాల్సిన సమయంలో ఇలాంటి సమస్యలు తలెత్తడం పట్ల ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ప్రింటర్‌ను మరమ్మతు చేయించి పాస్‌బుక్ ప్రింటింగ్ సేవలను పునరుద్ధరించాలని ధర్మసాగర్ మండల ప్రజలు కోరుతున్నారు.

Views: 4

About The Author

Tags:
Error on ReusableComponentWidget

Latest News