నేటి బాలలే రేపటి పౌరులు
మాట్లాడే బొమ్మతో పిల్లలను ఆకట్టుకున్న డీసీపీవో ఓంకార్
ములుగు, : బాలలకు ఆనందకరమైన బాల్యాన్ని అందిస్తేనే రేపటి ఉత్తమ సమాజ నిర్మాణం సాధ్యమని వరంగల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కృష్ణవేణి అన్నారు.
జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాల ముగింపు, ప్రపంచ బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా సంక్షేమ అధికారి ఇ.పి. ప్రేమలత అధ్యక్షత వహించారు.
ఓంకార్ అవగాహన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణ
ఈ వేడుకల్లో అందరినీ ఆకట్టుకున్నది జిల్లా బాలల పరిరక్షణ అధికారి జె. ఓంకార్ నిర్వహించిన అవగాహన కార్యక్రమం.మాట్లాడే బొమ్మ ద్వారా ఆయన పిల్లలకు సురక్షిత స్పర్శ, అసురక్షిత స్పర్శ గురించి చాలా సులభంగా, ఆసక్తికరంగా వివరించారు. ఏ స్పర్శ సరైందో, ఏ స్పర్శ ప్రమాదకరమో, అలాంటి పరిస్థితి ఎదురైతే భయపడకుండా వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు లేదా 1098కు చెప్పాలని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పారు.బొమ్మ మాట్లాడుతుండగానే పిల్లలు ఉత్సాహంగా స్పందించారు. ప్రశ్నలు అడిగి తమ సందేహాలు తీర్చుకున్నారు. పిల్లల భద్రతపై ఓంకార్ ఇచ్చిన ఈ అవగాహన కార్యక్రమానికి అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల నుంచి ప్రత్యేక ప్రశంసలు లభించాయి.
ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణవేణి మాట్లాడుతూ, బాలల హక్కులను కాపాడటం ప్రభుత్వం, తల్లిదండ్రుల బాధ్యత అన్నారు. సమస్యలు ఎదురైతే చైల్డ్ హెల్ప్ లైన్ 1098, 181, 100 నంబర్లకు తెలియజేయాలని సూచించారు.డీఎంహెచ్ఓ గోపాలరావు, బాలల సంక్షేమ సమితి చైర్‌పర్సన్ కె. వసుధ, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత మాట్లాడుతూ, పౌష్టికాహారం, లక్ష్యం, క్రమశిక్షణతో చదివితే ఉత్తమ పౌరులుగా ఎదుగుతారన్నారు.
అనంతరం విద్యార్థుల నృత్యాలు, పాటలు అలరించాయి. ఆటల పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు.కార్యక్రమంలో డీఈఓ సిద్ధార్థ రెడ్డి, డీఆర్‌డీఓ, జువెనైల్ జస్టిస్ బోర్డ్ సభ్యుడు సుభాష్, డీసీఆర్‌బీ డీఎస్పీ కిషోర్ కుమార్, సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


