మరణంలోనూ విడిపోని ఏడడుగుల బంధం..
- చాగల్లులో విషాదం శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : జీవితాంతం ఒకరికొకరు తోడుగా నిలిచిన ఆ దంపతులు.. మరణంలోనూ విడిపోలేకపోయారు. భర్త మరణించిన కొద్ది గంటల వ్యవధిలోనే భార్య కూడా కన్నుమూయడంతో స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని చాగల్లు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. చాగల్లు గ్రామానికి చెందిన వడ్లకొండ లోకనాథం (84), ఆయన భార్య వడ్లకొండ రామక్క (75) శుక్రవారం రాత్రి తీవ్ర విషాదానికి గురయ్యారు. శుక్రవారం రాత్రి సుమారు 9.50 గంటల సమయంలో లోకనాథం కన్నుమూశారు. భర్త మరణవార్తతో రామక్క తీవ్ర మనోవేదనకు గురై కన్నీరుమున్నీరుగా విలపించారు. భర్తతో ఎన్నో ఏళ్లుగా సాగిన జీవిత ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె తట్టుకోలేని బాధకు గురయ్యారు. ఇదిలా ఉండగా, శనివారం తెల్లవారుజామున సుమారు 2.40 గంటల సమయంలో రామక్క కూడా కన్నుమూశారు. గతంలో జరిగిన ప్రమాదంలో ఆమె కాలుకు రాడ్ వేయగా, అనంతరం ఇన్ఫెక్షన్ కారణంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వృద్ధాప్యంలోనూ ఒకరి ఆరోగ్యం గురించి మరొకరు ఆలోచిస్తూ, పరస్పర అనుబంధంతో జీవించిన ఆ దంపతుల జీవితం ఇలా విషాదాంతం కావడం గ్రామస్తులను కలచివేసింది. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. గంటల వ్యవధిలోనే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆ దంపతుల మరణంతో చాగల్లు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జీవితాంతం కలిసి సాగిన వారి వైవాహిక ప్రయాణం ఒకే రాత్రిలో ముగియడం స్థానికులను కంటతడి పెట్టించింది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

