పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి
సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలి మెదక్ జిల్లా ఎస్పీ. డి. వి. శ్రీనివాస రావు ఐపీఎస్
మెదక్ : పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడి సమస్యను ఓపికగా విని, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ సూచించారు. శుక్రవారం హవేలిఘనపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నిర్ణీత గడువులో ఛార్జిషీట్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు.
స్టేషన్ రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడిన ఎస్పీ.. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను ఓపికగా విని, ఫిర్యాదుల పరిష్కారానికి బాధ్యతాయుతంగా కృషి చేయాలని సూచించారు.
అనంతరం ఎస్ఐ కృష్ణయ్యతో పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక గ్రామాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. సివిల్ వివాదాల్లో పోలీసులు అనవసరంగా జోక్యం చేసుకోకుండా, సంబంధిత వ్యక్తులకు న్యాయస్థానాన్ని ఆశ్రయించే విధానంపై అవగాహన కల్పించాలని తెలిపారు.
సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రతి గ్రామంలో ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండేలా ప్రజలకు సూచనలు చేయడంతో పాటు, డ్రగ్స్ నిర్మూలనలో ప్రజలను భాగస్వాములను చేయాలని పేర్కొన్నారు.
సీసీటీయన్స్, ఈ -సాక్ష్య, అప్లికేషన్లలో కేసులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని అధికారులకు సూచించారు.
ఈ తనిఖీలో సీఐలు సందీప్ రెడ్డి, కృష్ణమూర్తి, ఎస్ఐ కృష్ణయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


