సెప్టెంబర్ 17 - విమోచనమా? విద్రోహమా?
- చరిత్రను తిరగరాసే కుట్రలపై కమ్యూనిస్టుల ప్రశ్న
- పినపాక ప్రభాకర్, రాష్ట్ర కన్వీనర్, కార్మిక సంక్షేమ సంఘం తెలంగాణ
షాద్,నగర్ : సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విద్రోహదినమే...తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను కాపాడుకుందాం,మతతత్వ పార్టీల విష ప్రచారాలను తిప్పికొడదాం అంటున్నారు కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్.సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా, భారత్‌లో విలీనమైన రోజుగా, తెలంగాణ ప్రజలకు విద్రోహం జరిగిన రోజుగా - భిన్న భాష్యాలతో చర్చ ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ క్రమంలో పీడిత ప్రజల విముక్తి కోసం ప్రాణాలర్పించిన కమ్యూనిస్టుల పాత్రను కనుమరుగు చేసే కుట్రలు కొనసాగుతున్నాయని ప్రభాకర్ ఆరోపించారు. వాస్తవ చరిత్రను వక్రీకరించి, నేటి తరం మనసులను కలుషితం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
భిన్న భాష్యాల వెనుక రాజకీయం
కొందరు విలీనం అని, మరికొందరు విమోచనమని, ఇంకొందరు స్వాతంత్రం అని ఎవరికి వారు స్వార్థ రాజకీయ కార్యాచరణను నడుపుతున్నారని ప్రభాకర్ మండిపడ్డారు. ఈ పోరాటాన్ని హిందూ-ముస్లిం మతాల గొడవగా చిత్రించి ప్రజలను విభజించే కుట్రలో భాగమే 'రజాకార్ ఫైల్స్' వంటి సినిమాలు అని, ఇక్కడే గత చరిత్రను సరిగ్గా అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. మతవిముక్తి దినోత్సవంగా మార్చి ఓటు రాజకీయం చేయాలని బీజేపీ చూస్తోందని, వామపక్షాల పాత్రను తక్కువ చేసి ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభల ఖాతాలో ఘనతను వేసే విష ప్రచారం సాగుతోందని ఆయన విమర్శించారు.తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముందుండి నడిపింది కమ్యూనిస్టులేనని, ఈ పోరాటంలో 4,000 మందికి పైగా కార్యకర్తలు ప్రాణాలర్పించారని, 3,000 గ్రామాలను విముక్తి చేసి దాదాపు 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత వారిదేనని ప్రభాకర్ గుర్తుచేశారు. ఆ సమయంలో ఆర్ఎస్ఎస్‌కు ఈ పోరాటంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మగ్దూం మొహియుద్దీన్, షోయబుల్లా ఖాన్, బందగీ వంటి ముస్లిం వీరులు నిజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులతో కలిసి పోరాడి అమరులయ్యారని, మరోవైపు విసునూరు రామచంద్రారెడ్డి వంటి హిందూ దొరలు నిజాం పక్షాన నిలిచి ప్రజలను పీడించారని ఆయన ఉదాహరించారు.ఇది మతాల పోరాటం కాదని, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సాగిన పోరాటమని నొక్కిచెప్పారు.
నిజాం పాలనలో పీడిత తెలంగాణ
1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన అంతమయ్యాక, దేశంలోని 568 సంస్థానాల్లో నాలుగు తప్ప అన్నీ యూనియన్‌లో విలీనమ య్యాయి.హైదరాబాద్‌తో సహా నిజాం, జమ్మూకాశ్మీర్, జునాగఢ్, త్రిపుర సంసిద్ధత చూపలేదు. 16 జిల్లాల నిజాం సంస్థానంలో ప్రజలు వెట్టిచాకిరి, అధిక పన్నులు, హత్యలు, అత్యాచారాలు, స్త్రీలను నగ్నంగా బతుకమ్మ ఆడించడం వంటి దురాగతాలను ఎదుర్కొన్నారని ప్రభాకర్ వివరించారు. జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, దొరలను తాబేదారులుగా నియమించుకున్న నిజాం, రజాకార్ల ప్రైవేట్ సైన్యంతో ప్రజలపై దాడులు సాగించాడని, వ్యతిరేకించిన గ్రామాలను రాత్రికి రాత్రి తగలబెట్టేవారని ఆయన గుర్తుచేశారు.
ఆంధ్ర మహాసభ నుంచి సాయుధ పోరాటం దాకా
వెట్టి చాకిరి, అధిక శిస్తుకు వ్యతిరేకంగా మొదలైన ఆంధ్ర జన సంఘం, 1930 నాటికి ఆంధ్ర మహాసభగా, ఆపై కమ్యూనిస్టు పార్టీగా రూపాంతరం చెందింది.దున్నేవాడిదే భూమి నినాదంతో సాగిన ఈ ఉద్యమం 1946 నాటికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంగా మారింది. దొడ్డి కొమరయ్య, షేక్ బందగీ, షోయబుల్లాఖాన్ వంటి వీరులు ప్రాణాలర్పించారు. విసునూరు దొర ఆగడాలపై చాకలి అయిలమ్మ నాయకత్వంలో సాగిన పోరాటం నల్గొండ నుంచి నిజాం రాజ్యమంతటా వ్యాపించింది. 10 లక్షల ఎకరాల భూమిని ప్రజలు సొంతం చేసుకుని, 3,000 గ్రామాల్లో ప్రజారాజ్యాలను నెలకొల్పుకున్నారని ప్రభాకర్ తెలిపారు.
ఆపరేషన్ పోలో - విముక్తా, దాడా?
ప్రజా పోరాటాలతో నిజాం పూర్తిగా బలహీనపడగా, ఈ ఉద్యమం దేశవ్యాప్తమవుతుందన్న భయంతో నెహ్రూ ప్రభుత్వం 'ఆపరేషన్ పోలో' పేరుతో దండయాత్ర చేసిందని ప్రభాకర్ చెప్పారు. నిజాం ఒక్కరోజులోనే లొంగిపోయినా, సైన్యం దురాక్రమణ మాత్రం 600 రోజులు కొనసాగిందని, ఈ కాలంలో వేలాది మంది ప్రజలను, విప్లవకారులను చెట్లకు కట్టి కాల్చి చంపారని ఆయన ఆరోపించారు. నిజాంకు 'రాజ్ ప్రముఖ్' బిరుదుతో పాటు కోటిన్నర రూపాయల నజరానా ఇచ్చారని, 4,000 మంది కమ్యూనిస్టు విప్లవకారులను హతమార్చి, పంచిన భూములను తిరిగి భూస్వాములకే అప్పగించారని ఆయన మండిపడ్డారు. "ఆ భూస్వాములే నేడు రాజకీయ నాయకులు, సినీ నిర్మాతలు, వ్యాపార వేత్తలుగా మారి చరిత్రను వక్రీకరిస్తున్నారు" అని వ్యాఖ్యానించారు.
విలీనమూ లేదు... విమోచనా లేదు
1948 సెప్టెంబర్ 17న జరిగింది అసంపూర్ణ విలీనమేనని, నిజాంకు ఎలాంటి శిక్షా పడలేదని, ఆయన అరాచకాలు కొనసాగాయని ప్రభాకర్ అన్నారు. నిజాంతో యథాస్థితి ఒప్పందం మాత్రమే కుదిరిందని, సర్ఫేఖాస్ భూములు ఆయన ఆధీనంలోనే ఉండిపోయాయని, బంగారం, నగలు విదేశాలకు తరలిపోయాయని ఆయన పేర్కొన్నారు. 1950 నుంచి 1956 వరకు రాజ్ ప్రముఖ్‌గా, ఆపై 1971 వరకూ ఏటా రూ.50 లక్షల రాజభరణం పన్ను మినహాయింపుతో నిజాంకు అందిందని తెలిపారు. గ్రామాల్లో పెరిగిన తిరుగుబాటు, కమ్యూనిస్టు పార్టీ బలోపేతం, 10 లక్షల ఎకరాల భూ పంపిణీ, 3,000 గ్రామాల్లో గ్రామ రాజ్య కమిటీలను ప్రమాదంగా భావించిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిజాంతో ఒప్పందం కుదుర్చుకుందే తప్ప, నిజమైన విలీనం గానీ విమోచన గానీ జరగలేదని ప్రభాకర్ స్పష్టం చేశారు.అందుకే 1948 సెప్టెంబర్ 17న జరిగింది విద్రోహమే... అని అన్నారు.చరిత్రను చరిత్రగా భద్రపరచుకున్నప్పుడే, భవిష్యత్తు నిర్మాణ దిశను ప్రజలు తామే నిర్ణయించుకోగలరని పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


