వైద్య విద్యలో మధ్యతరగతి బిడ్డల ప్రతిభ
- కలల సాధనలో ఆర్థిక సవాళ్లను అధిగమించిన వేళ
- అన్నాచెల్లెళ్లకు, తల్లిదండ్రులకు ఘన సన్మానం
మంచిర్యాల టౌన్ : కష్టాలను లెక్కచేయకుండా, పిల్లల చదువే తమ భవిష్యత్తు అని భావించి తల్లిదండ్రులు చేసిన కృషికి నిలువెత్తు నిదర్శనంగా గుజ్జేటి నగేష్–సుజాత దంపతుల పిల్లలు జి.అభిలాష్ జి. శ్రీనిధి నిలిచారు. మరో ప్రాంతం నుంచి మంచిర్యాలకు వచ్చి జీవనం సాగిస్తున్న ఈ కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ పిల్లల చదువుకు ప్రాధాన్యత ఇచ్చింది. తండ్రి నగేష్ మిర్చిబండి నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ, పిల్లల ఉన్నత విద్య కోసం ఎంతో శ్రమించారు. వారి కష్టానికి ప్రతిఫలంగా కుమారుడు జి అభిలాష్ ఎంబీబీఎస్ 4వ సంవత్సరంలోకి ప్రవేశించగా, కుమార్తె జి శ్రీనిధి ఈ ఏడాది ఎంబీబీఎస్ లో చేరబోతోంది. ఈ సందర్భంగా నవోదయ టీం సభ్యులు, స్నేహితులు అభిలాష్, శ్రీనిధిలను పుష్పగుచ్ఛాలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. పిల్లల విజయానికి వెన్నుదన్నుగా నిలిచిన తల్లిదండ్రులు నగేష్–సుజాత దంపతులను కూడా శాలువాలతో సత్కరించి అభినందించారు. కష్టపడి పనిచేసే తల్లిదండ్రులు, చదువుపై పట్టుదల ఉన్న పిల్లలు కలిస్తే ఆర్థిక పరిస్థితులు విజయానికి అడ్డుకావు అని ఈ కుటుంబం నిరూపించిందని నవోదయ టీం సభ్యులు పేర్కొన్నారు. మిర్చిబండి నడుపుతూ పిల్లల భవిష్యత్తు కోసం తండ్రి చేసిన కష్టం, పిల్లల పట్టుదల కలిసి సాధించిన ఈ విజయం ఎంతోమంది మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


