ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

నషా ముక్త్ భారత్ అభియాన్, సైబర్ సెక్యూరిటీపై వార్తలాప్ మీడియా పి ఐ జి ద్వారా పాత్రికేయులకు వర్క్‌షాప్‌ 

ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి బ్యూరో : ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాలు, ముఖ్యంగా సామాజిక సంక్షేమం, ప్రజా భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్  ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం నిర్వహించిన ‘వార్తలాప్’ మీడియా వర్క్‌షాప్ ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యక్రమాల సమాచారం, అవగాహనా సందేశాలను విస్తృత ప్రజానీకానికి చేరవేయడంలో సమర్థవంతమైన కమ్యూనికేషన్, మీడియా ఔట్‌రీచ్‌ ఎంతో ముఖ్యమని అన్నారు.ఈ వర్క్‌షాప్‌లో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’, ‘సైబర్ సెక్యూరిటీ’ అనే రెండు ముఖ్యమైన అంశాలపై చర్చలు జరిగాయి. నషా ముక్త్ భారత్ అభియాన్ పై ఈగల్ ఫోర్స్ డీఎస్పీ  సోమనాథం మాట్లాడుతూ, మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పేర్కొన్నారు. యువత, కుటుంబాలు, సమాజంలోని వివిధ వర్గాలకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర పోషించగలదని ఎక్సైజ్ సూపరింటెండెంట్  ముకుంద్ రెడ్డి అన్నారు. రెండవ అంశమైన సైబర్ సెక్యూరిటీపై సీ-డాక్ సీనియర్ సైంటిస్ట్  జగదీష్ బాబు మాట్లాడుతూ, సైబర్ ముప్పులు, ఆన్‌లైన్ భద్రత, బాధ్యతాయుతమైన డిజిటల్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని వివరించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండటంతో పాటు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించేటప్పుడు సురక్షితమైన పద్ధతులను పాటించాలని సూచించారు.ప్రారంభోపన్యాసంలో పీఐబీ జాయింట్ డైరెక్టర్ డా. మనస్ కృష్ణకాంత్ మాట్లాడుతూ, టియర్-2, టియర్-3 నగరాల్లోని ప్రజలకు చేరువ కావడం, ముఖ్యమైన అంశాలపై ప్రజలను మీడియా ద్వారా చైతన్యపరచడం లక్ష్యంగా సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  ఎన్.వై. గిరి, పీఐబీ మీడియా & కమ్యూనికేషన్ ఆఫీసర్  శివచరణ్ రెడ్డి పాల్గొన్నారు.‘వార్తలాప్’ మీడియా వర్క్‌షాప్ లో మీడియా ప్రతినిధులు, సంబంధిత వర్గాలు పాల్గొని ప్రజా ప్రయోజనానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, అవగాహనా సందేశాలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేసే అంశాలపై ప్రింట్, ఎలక్ట్రానిక్, ఉర్దూ, ఇంగ్లీష్, డిజిటల్ తదితర పాత్రికేయులు సమావేశంలో పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News