భూభారతి పెండింగ్ దరఖాస్తులను నెలాఖరులోగా పరిష్కరించాలి : కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్,: భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో బుధవారం ఆయన అన్ని మండలాల తహసిల్దార్లతో భూభారతి పెండింగ్ దరఖాస్తులు, ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం, ఇతర రెవెన్యూ అంశాలపై సమీక్ష జరిపారు. ఒక్కో మండలం వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు ఎన్ని అని ఆరా తీస్తూ, వాటి పరిష్కారంలో జాప్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ దరఖాస్తులను సమగ్రంగా పరిశీలన జరుపుతూ ఈ నెలాఖరులోగా అన్నింటిని పరిష్కరించాలని కలెక్టర్ గడువు విధించారు. జూలై 31లోపు వచ్చిన అర్జీలలో ఏ ఒక్కటి కూడా పెండింగ్ లో ఉండకూడదని అన్నారు. దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చొరవ చూపాలని, సుదీర్ఘ కాలం నుండి పెండింగ్ లో ఉన్న అర్జీలపై ప్రత్యేక దృష్టిని కేంద్రికరించాలని సూచించారు. దరఖాస్తుల పరిశీలన, పరిష్కారం, తిరస్కరణ విషయంలో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని, అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా అర్హత కలిగిన ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. కాగా, ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారులకు ఇసుక అందుబాటులో ఉండేలా చొరవ చూపాలని, ఇసుక కేటాయింపులో అక్రమాలకు తావు లేకుండా, మధ్య దళారుల ప్రమేయం లేకుండా గట్టి నిఘా కొనసాగించాలని కలెక్టర్ ఆదేశించారు. గృహ నిర్మాణాలు చేపడుతున్న లబ్దిదారులను క్షేత్రస్థాయిలో సంప్రదించి, వారికి నిర్ణీత ధరకే ఇసుక కేటాయింపులు జరుగుతున్నాయా, లేదా అని ఆరా తీయాలన్నారు. ఎక్కడైనా అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తిస్తే, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కేటాయింపు ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని, అర్హులైన వారికి లాటరీ విధానం ద్వారా ఇళ్ళను కేటాయించాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, డీఆర్ఓ గీత, ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, విజయ కుమారి, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


