ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం

 ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం

  • ‎‎విద్యుత్ పొదుపుతోనే పెరుగుతున్న డిమాండ్‌కు సమర్థవంతమైన పరిష్కారం
  • ‎తెలంగాణలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం.. సంపద సృష్టికర్తలకు స్వాగతం
  • ‎‎2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ లక్ష్యం
  • డిసెంబర్‌7,8,9 తేదిలలో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’
  • 25వ CII ఎనర్జీ ఎఫిషియెన్సీ సమ్మిట్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు వినియోగాన్ని సమర్థవంతంగా తగ్గించడం ద్వారా కూడా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను అధిగమించవచ్చని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. “మనం ఉత్పత్తి చేసే విద్యుత్ యూనిట్ కంటే అవసరం లేకుండా పొదుపు చేసే విద్యుత్ యూనిటే చౌకైనది” అని పేర్కొన్నారు. ఇంధన సామర్థ్యాన్ని కేవలం పర్యావరణ పరిరక్షణ అంశంగా కాకుండా ఆర్థిక పోటీతత్వాన్ని పెంచే వ్యూహంగా చూడాలని సూచించారు. బుధవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన 25వ సిఐఐ- ఎనర్జీ ఎఫిషియెన్సీ సమ్మిట్-2026 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం హాజరై ప్రసంగించారు. ‎ఇప్పటివరకు ఇంధన విధానాన్ని ప్రధానంగా సరఫరా కోణంలోనే చూశామని అన్నారు. "ఎంత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది, ఎంత బొగ్గు అందుబాటులో ఉంది, ఎంత పునరుత్పాదక విద్యుత్‌ను జోడించగలం, ఎంత ట్రాన్స్‌మిషన్ మౌలిక వసతులు అవసరం వంటి అంశాలపై దృష్టి పెట్టామని" చెప్పారు. అయితే మన ముందే మరో విద్యుత్ కేంద్రం ఉందని, దానికి పొగ గొట్టం, బొగ్గు గని, భూమి, కొత్త ట్రాన్స్‌మిషన్ లైన్ అవసరం లేదని అన్నారు. అదే ఇంధన సామర్థ్యమని వివరించారు. మెరుగైన మోటార్లు, సమర్థవంతమైన శీతలీకరణ వ్యవస్థలు, ఇంధన సామర్థ్య భవనాలు, మెరుగైన పారిశ్రామిక ప్రక్రియలు, స్మార్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించవచ్చన్నారు. ప్రతి మెగావాట్ విద్యుత్ డిమాండ్‌ను శాశ్వతంగా తగ్గించగలిగితే మొత్తం విద్యుత్ వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు.WhatsApp Image 2026-09-16 at 1.59.56 PM
‎‎వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో భవిష్యత్తులో విద్యుత్ అవసరం మరింత పెరుగుతుందని డిప్యూటీ సీఎం అన్నారు. రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమలు, తయారీ రంగం, డేటా సెంటర్లు, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులు రావాల్సి ఉందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నందున అభివృద్ధి వేగాన్ని తగ్గించడం పరిష్కారం కాదని, ప్రతి యూనిట్ విద్యుత్‌తో మరింత ఆర్థిక కార్యకలాపాలను సాధించడమే పరిష్కారమని స్పష్టం చేశారు.
‎‎పారిశ్రామిక సంస్థలు తక్కువ విద్యుత్ వినియోగిస్తే వాటి నిర్వహణ వ్యయం తగ్గుతుందని అన్నారు. తెలంగాణలో పీక్ విద్యుత్ డిమాండ్ తగ్గితే ఉత్పత్తి, ట్రాన్స్‌మిషన్ వ్యవస్థలపై ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు. దేశానికి ఇంధన భద్రత పెరగడంతో పాటు పర్యావరణంపై ప్రతికూల ప్రభావం, ఉద్గారాలు తగ్గుతాయని వివరించారు. ఇంధన సామర్థ్యం వ్యాపార సంస్థల నిర్వహణ వ్యయాలను తగ్గించడంతో పాటు వనరుల ఉత్పాదకతను పెంచుతుందని చెప్పారు. గొప్ప ఆవిష్కరణలు ఎప్పుడూ ప్రయోగశాలల్లోనే జరగాల్సిన అవసరం లేదన్నారు. ఒక పరిశ్రమలో విజయవంతమైన సాంకేతికత మరో పరిశ్రమకు ఉపయోగపడుతుందని చెప్పారు. సిమెంట్ పరిశ్రమలో పరిష్కరించిన సమస్య ఉక్కు పరిశ్రమకు ఉపయోగపడవచ్చని, పేపర్ మిల్లులో అమలు చేసిన ఇంధన సామర్థ్య విధానం ఇతర రంగాలకు ఆదర్శంగా నిలవవచ్చన్నారు. “తదుపరి కొత్త సాంకేతికత ఏమిటి?” అనే ప్రశ్నతో పాటు “ఇప్పటికే ఏది విజయవంతంగా పనిచేస్తోంది? దాన్ని ఎంత వేగంగా విస్తరించగలం?” అనే ప్రశ్న కూడా ఉండాలి అని సూచించారు. భారత్‌లో మంచి పైలట్ ప్రాజెక్టులకు కొరత లేదని, ఒక కర్మాగారంలో విజయవంతమైన ప్రయోగాన్ని వంద కర్మాగారాలకు విస్తరించడమే అసలు సవాలని అన్నారు.
‎‎AIతో ఇంధన వినియోగంలో సమర్థత
‎‎ఇంధన సామర్థ్యంలో తదుపరి తరం సాంకేతికతలు కీలక పాత్ర పోషించనున్నాయని డిప్యూటీ సీఎం అన్నారు. పునరుత్పాదక ఇంధనం, విద్యుదీకరణ, డిజిటలైజేషన్, స్మార్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌తో పాటు కృత్రిమ మేధస్సు వంటి ఆధునిక సాంకేతికతలను విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. సెన్సర్ల ద్వారా ఎక్కడ విద్యుత్ వృథా అవుతుందో గుర్తించవచ్చని, డిజిటల్ వ్యవస్థలతో పారిశ్రామిక ప్రక్రియలను నిరంతరం మెరుగుపరచవచ్చని చెప్పారు. మానవ ఆపరేటర్లు గుర్తించలేని నమూనాలను కూడా కృత్రిమ మేధస్సు గుర్తించగలదన్నారు. భవిష్యత్తులో కర్మాగారాలు కేవలం విద్యుత్ వినియోగదారులుగా కాకుండా విద్యుత్ వ్యవస్థలో చురుకైన భాగస్వాములుగా మారాల్సిన అవసరం ఉందన్నారు. ఇంధన సామర్థ్యం విషయంలో పరిశ్రమలకు మూడు సూచనలు చేశారు.ఇంధన వినియోగాన్ని కొలవకుండా వ్యవస్థాగత మార్పులు చేయడం సాధ్యం కాదని, అందుకే దీనిని ఏడాదికోసారి నిర్వహించే ఆడిట్‌గా కాకుండా నిరంతర పర్యవేక్షణ ప్రక్రియగా మార్చాలని స్పష్టం చేశారు. అలాగే, ఒక పరిశ్రమలో విజయవంతమైన పొదుపు విధానాలను ఇతర వందలాది సంస్థలు నేర్చుకుని అమలు చేసేలా అనుభవాల మార్పిడికి అనువైన వ్యవస్థను రూపొందించాలని పిలుపునిచ్చారు. దీంతో పాటు ప్రభుత్వం, ఆర్థిక, విద్యా మరియు సాంకేతిక సంస్థలు పరిశ్రమలతో కలిసి పనిచేస్తూ వాణిజ్యపరంగా లబ్ధి చేకూర్చే ఉత్తమ సాంకేతికతలను విస్తృత స్థాయిలో అన్ని సంస్థలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ మూడు సూత్రాలను ప్రాతిపదికగా తీసుకుని ముందుకు సాగితేనే పారిశ్రామికంగా ఇంధన సామర్థ్యంలో ఆశించిన పురోగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
‎తెలంగాణకు అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు
‎‎తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని  అన్నారు. అత్యుత్తమ అంతర్జాతీయ విమానాశ్రయం, మెరుగైన రహదారులు, ఔటర్ రింగ్ రోడ్, శక్తి, ప్రతిభ, అనుకూల వాతావరణంతో పాటు శాంతిభద్రతలు రాష్ట్రానికి బలమైన అంశాలని పేర్కొన్నారు. తెలంగాణ స్నేహపూర్వక, పారిశ్రామిక అనుకూల రాష్ట్రంగా ఉందన్నారు. పెట్టుబడిదారులను ప్రభుత్వం “సంపద సృష్టికర్తలు”గా భావిస్తోందని తెలిపారు. “కలిసి ఎదగడానికి తెలంగాణ రాష్ట్రానికి సంపద సృష్టికర్తలందరికీ స్వాగతం పలుకుతున్నాం” అని భట్టి అన్నారు.
‎‎2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ
‎‎తెలంగాణ , 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. విద్యుత్ రంగంతో పాటు అన్ని ఇతర రంగాలను కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక వసతులు, ఇంధన రంగం తదితర అంశాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
‎‎డిసెంబర్‌లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
‎‎గత ఏడాది గ్లోబల్ సమ్మిట్ నిర్వహించినట్టుగానే, ఈ ఏడాది డిసెంబర్‌లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమల ప్రతినిధులు, పెట్టుబడిదారులు ఈ సమ్మిట్‌కు హాజరు కావాలని ఆయన కోరారు. “మీ అందరూ వీలైనంత వరకు ఈ గ్లోబల్ సమ్మిట్‌కు తప్పకుండా హాజరై, మన తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలి” అని పిలుపునిచ్చారు. ‎తెలంగాణ అభివృద్ధి వేగంగా ఉండటంతో పాటు సమర్థవంతంగా, తెలివిగా ఉండాలని అన్నారు. ప్రజలకు, పరిశ్రమలకు మరింత విద్యుత్ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రతి యూనిట్ విద్యుత్‌తో మరింత ఫలితాన్ని సాధించాలన్నారు. “మరింత ఉత్పత్తి చేయాలి.. మరింత అభివృద్ధి చెందాలి.. వృథాను తగ్గించాలి” అనే లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇది మంచి ఆర్థిక విధానమే కాకుండా స్థిరమైన అభివృద్ధికి ఆచరణాత్మక మార్గమని పేర్కొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News