గుండె వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి
హనుమకొండ న్యూస్ : గుండె వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం. అప్పయ్య సూచించారు. మంగళవారం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా హనుమకొండలోని ఏకశిలా హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో అశోక కాన్ఫరెన్స్ హాల్లో ఉచిత వైద్య శిబిరం, అవగాహన సదస్సు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎంహెచ్యో డాక్టర్ ఎం. అప్పయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుండె సంబంధిత నొప్పి వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ధూమపానం. మద్యపానానికి దూరంగా ఉండడంతో పాటు శారీరక వ్యాయామాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని తెలిపారు.ఏకశిలా హాస్పిటల్ ఎండీ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు తమ జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవాలని సూచించారు. ప్రతిరోజూ వాకింగ్, వ్యాయామం, యోగా వంటి కార్యకలాపాలను తప్పనిసరిగా అలవాటుగా చేసుకోవాలని తెలిపారు. ఏకశిలా హాస్పిటల్లో నెల రోజులపాటు గుండె సంబంధిత వ్యాధులపై ఉచిత వైద్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఏకశిలా హాస్పిటల్ డైరెక్టర్లు డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఆసిఫ్ ఇక్బాల్, హాస్పిటల్ కార్డియాలజిస్టులు డాక్టర్ రామకృష్ణ రెడ్డి, డాక్టర్ అనిల్ బన్నా, డాక్టర్ చేతన్ కృష్ణ, క్లినికల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ లావణ్య, సిటీ సర్జన్ డాక్టర్ సబీహా నిగార్ మాట్లాడుతూ, గుండెకు సంబంధించిన నొప్పి వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. కోవిడ్ అనంతరం వయస్సుతో సంబంధం లేకుండా వస్తున్న గుండె సంబంధిత వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వైద్యుల సలహా మేరకు ప్రతి మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి గుండెకు సంబంధించిన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, పరీక్షల ఫలితాల ఆధారంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమం అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 560 మందికి పైగా ప్రజలకు బీపీ, షుగర్, ఈసీజీ, 2D ఎకో తదితర పరీక్షలను ఉచితంగా నిర్వహించి, వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ శీదేవితో పాటు హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


