సీఎం పర్యటన వేళ ముందస్తు అరెస్టులు.
కొత్తపల్లి : ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కరీంనగర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సీఎం నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించడంతో పాటు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి నిరసనలు, ఆందోళనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినట్లు సమాచారం. సీఎం పర్యటనను నిరసిస్తూ ఆందోళనలకు దిగే అవకాశం ఉందన్న సమాచారంతో బీఆర్ఎస్, బీజేపీ కి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, సామాజిక ఉద్యమకారులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నరు. కొందరిని ఇళ్ల వద్దే నిలిపివేసి బయటకు వెళ్లకుండా హౌస్ అరెస్టులు చేసినట్లు సమాచారం. మరికొందరిని పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు తెలిసింది. గతంలోనూ కరీంనగర్ జిల్లాలో నిరసనలకు పిలుపునిచ్చిన సందర్భాల్లో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్న ఘటనలు నమోదయ్యాయి. సీఎం పర్యటన కోసం కరీంనగర్ కమిషనరేట్ పరిధి నుంచి సుమారు 550 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని బందోబస్తుకు కేటాయించినట్లు సీపీ గౌష్ ఆలం వెల్లడించారు. హెలిప్యాడ్, కాన్వాయ్ మార్గాలు, కలెక్టరేట్ పరిసరాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లోకి వచ్చాయి. ప్రతిమ థియేటర్ టీ జంక్షన్ నుంచి మమత థియేటర్ మీదుగా భగత్‌నగర్ టీ జంక్షన్ వరకు వాహనాల రాకపోకలను నియంత్రించడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


