చెదలు పట్టేంత కాలం PRCను సాగదీస్తారా?
- ఉద్యోగుల నిరీక్షణకు ముగింపు ఎప్పుడు?
- ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎడబోయిన శ్రీనివాసరెడ్డి
హుస్నాబాద్ : ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతన సవరణ కోసం రూపొందించిన 2023 పిఆర్సి రిపోర్టుపై ప్రభుత్వం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం తీవ్ర ఆవేదన కలిగిస్తోందని ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎడబోయిన శ్రీనివాసరెడ్డి అన్నారు. సంవత్సరాలు గడుస్తున్నా PRC అమలుపై స్పష్టత లేకపోవడంతో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.PRC రిపోర్టు ఉద్యోగుల భవిష్యత్తును నిర్ణయించాల్సిన కీలక పత్రం కాగా, అది ఏళ్ల తరబడి మూలన పడటం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పెరుగుతున్న ధరలు, కుటుంబాల ఆర్థిక భారం, పిల్లల విద్య, వైద్య ఖర్చులతో ఉద్యోగులు సతమతమవుతున్నారని తెలిపారు. ఇకనైనా PRCను సాగదీయకుండా ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఒకేషనల్ టీచర్ల సమస్యలను పట్టించుకోరా?
తెలంగాణలో ఒకేషనల్ టీచర్ల సమస్యలపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, జేఏసీ ఎందుకు ప్రత్యేకంగా దృష్టి సారించడం లేదని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. రిటైర్డ్ ఒకేషనల్ టీచర్లకు పెన్షన్, వైద్య సదుపాయాలు వంటి అంశాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.ఒకేషనల్ టీచర్లకు హెల్త్ కార్డులు, పెన్షన్ తదితర అంశాలపై స్పష్టమైన విధానం ప్రకటించాలని, ఈ సమస్యలను జేఏసీ, ఉపాధ్యాయ సంఘాలు తమ ప్రధాన డిమాండ్లలో చేర్చి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు.
CPS రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి దయనీయం
CPS విధానంలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగులు పెన్షన్, వైద్య సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉద్యోగుల ఖాతాల్లో ప్రభుత్వ వాటా సకాలంలో జమ కాకపోవడం వల్ల వారికి రావాల్సిన ప్రయోజనాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.CPS రిటైర్డ్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పెన్షన్ సమస్యతో పాటు హెల్త్ కార్డులు, ప్రభుత్వ వాటా, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, డీఏ బకాయిల వంటి సమస్యలను కూడా ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు.
జేఏసీ ఇకనైనా గళమెత్తాలి ఒకేషనల్ టీచర్లు, CPS ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని శ్రీనివాసరెడ్డి కోరారు. ఉద్యోగుల సమస్యలు కేవలం సమావేశాలు, చర్చలకే పరిమితం కాకుండా పరిష్కారం దిశగా చర్యలు ఉండాలని అన్నారు.PRCను తక్షణమే అమలు చేయడంతో పాటు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, ఒకేషనల్ టీచర్లు మరియు CPS రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను ప్రత్యేకంగా పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగుల నిరీక్షణకు ప్రభుత్వం ఇకనైనా ముగింపు పలకాలని ఎడబోయిన శ్రీనివాసరెడ్డి కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


