అధికారులు రహదారి భద్రతపై ప్రజలకు ఆదర్శంగా నిలవాలి జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్

గద్వాల : అధికారులు రోడ్డు నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ రహదారి భద్రత విషయంలో ప్రజలకు ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ పిలుపునిచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఐడిఓసి సమావేశపు మందిరంలో నిర్వహించిన చేరుకోండి, జీవించండి, అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, ఎస్పి శ్రీనివాసరావు తో కలిసి కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ మాట్లాడుతూ అధికారులు ప్రతి నిత్యం తమ కార్యాలయాలకు ద్విచక్ర వాహనాలు, కార్లలో వస్తుంటారు కాబట్టి తాము తప్పకుండా రహదారి నియమాలను పాటించాలన్నారు. ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ శాఖ రహదారులు నిర్మించేటప్పుడు నాణ్యతతో పాటు, రోడ్డు భద్రత ఉండేలా డిజైన్ చేసే విషయంలో అధికారులు నిబంధనలను పాటించాలని, అలాంటప్పుడే వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా చూడవచ్చు అన్నారు. తాను హైదరాబాదులో ఔటర్ రింగ్ రోడ్డు ఎండీ గా పనిచేసిన సమయంలో అక్కడ జరిగిన ప్రమాదాలకు కారణాలను విశ్లేషించడం జరిగిందని, స్పీడ్ లిమిట్ ఒక రకంగా డిజైన్ చేసి ఉంటే వాహనదారులు అధిక వేగంతో పోవడం, అకస్మాత్తుగా రహదారులపై వాహనాలను నిలపడం వంటివి ప్రమాదాలకు కారణమవుతున్నాయన్నారు. కర్నూల్ జిల్లాలో గతేడాది జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది మృత్యువాత పడడం, ఇతర సంఘటనలను దృష్టిలో ఉంచుకొని డ్రైవర్లు ఎంతో బాధ్యతాయుతంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయాల్సి ఉందన్నారు. ప్రమాదాల కారణంగా ఆయా వ్యక్తుల నుంచి రావాల్సిన వస్తు ఉత్పత్తి తగ్గిపోతుందని, ఫలితంగా దేశ జిడిపి పై దాని ప్రభావం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతుండడం ప్రస్తుతం సర్వసాధారణమైందని, ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ప్రతి ఒక్కరూ రహదారి భద్రతపై అవగాహనతో ముందుకెళ్లాలన్నారు. మద్యం సేవించి, సెల్ ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడపడం వంటి కారణాలతో ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. ఇలా జరగకుండా ఉండాలంటే సంబంధిత రవాణా శాఖ, ట్రాఫిక్, పోలీస్ అధికారులు కఠినంగా వ్యవహరించాలని అప్పుడే ప్రతి ఒక్కరూ రహదారి నియమాలను పాటిస్తారన్నారు. కొన్ని దేశాల్లో రహదారి భద్రతపై ప్రజలకు మంచి అవగాహన ఉందని, మన వద్ద కూడా ప్రమాదాల నివారణకు ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉందన్నారు.
జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ
పౌరుల బాధ్యతాయుతమైన ప్రవర్తనతోనే రహదారి ప్రమాదాలను నివారించవచ్చని, రోడ్డు భద్రత ప్రతి కుటుంబానికి సంబంధించిన విషయమని పేర్కొన్నారు. ఇంటి యజమాని, పిల్లలు, జీవిత భాగస్వామి అనుకోని ప్రమాదాలతో మృతిచెందితే ఆయా కుటుంబాలు అనుభవించే ఆర్థిక, మానసిక వేదనను పూడ్చడం చాలా కష్టమన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖలో పనిచేసే ఉద్యోగులు ద్విచక్ర వాహనంపై వచ్చేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధన ఉండాలన్నారు. ద్విచక్ర వాహనంపై మహిళలను, చిన్నారులను ఎక్కించుకునీ నడిపేటప్పుడు వారిని గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చే విషయంపై జాగ్రత్తలు పాటించాల్సి ఉందన్నారు. ప్రమాదాల బారిన పడిన క్షతగాత్రులకు సరైన సమయంలో చికిత్స అందించడం వైద్య శాఖ అధికారుల బాధ్యత అని గుర్తు చేశారు. విద్యాశాఖ అధికారులు కూడా పాఠశాల బస్సులు సరైన కండిషన్లో ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని, ఫలితంగా విద్యార్థులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చవచ్చన్నారు. ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకుండా రవాణా శాఖ, ఇతర అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా పౌరులకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు వారికి ఆ వాహనాలను సరిగ్గా నడపడం వస్తుందో, లేదో పరిశీలించాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో, తమ కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకొని వాహనాలను నడపడం వలన ప్రమాదాలను చాలావరకు తగ్గించవచ్చని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రహదారి ప్రమాదాల నివారణపై ముద్రించిన పోస్టర్లను అతిధులు విడుదల చేశారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి అతిథులు రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, అదనపు ఎస్పి శంకర్, ఆర్డీవో అలివేలు, పలువురు ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు, పోలీసు శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.


