శీతాకాలంలో పొగమంచు పట్ల అప్రమత్తంగా ఉండాలి
వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్
మెదక్, జిల్లా పరిధిలో శీతాకాలం తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఉదయం, రాత్రి వేళల్లో రహదారులపై పొగమంచు ఏర్పడుతోంది. దీంతో ఎదురుగా, ముందు ప్రయాణిస్తున్న వాహనాలు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ద్విచక్ర వాహనదారులు పాటించాల్సిన జాగ్రత్తలు:
1. ఐఎస్ఐ గుర్తింపు కలిగిన హెల్మెట్‌ను స్పష్టమైన (గ్లాస్) వైజర్‌తో తప్పనిసరిగా ధరించాలి.
2. హైబీమ్ లైట్లకు బదులుగా లోబీమ్ లైట్లను ఉపయోగించాలి.
3. వాహన వేగాన్ని తగ్గించి, ముందున్న వాహనానికి తగినంత దూరం పాటించాలి.
4. రిఫ్లెక్టివ్ జాకెట్లు, రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు ఉపయోగించాలి.
5. అకస్మాత్తుగా బ్రేకులు వేయకూడదు. రహదారి తడిగా ఉన్నప్పుడు వాహనం స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది.
6. మలుపులు తిరిగే ముందు ఇండికేటర్లు వేయాలి.
7. పొగమంచు ఎక్కువగా ఉండే తెల్లవారుజామున, రాత్రి వేళల్లో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు నివారించాలి.
8. చలి నుంచి రక్షణతో పాటు వాహనంపై నియంత్రణ కోసం గ్లౌవ్స్ ధరించాలి.
ఫోర్ వీలర్ వాహనదారులు పాటించాల్సిన జాగ్రత్తలు:
1. ఫాగ్ ల్యాంప్స్ లేదా లోబీమ్ హెడ్‌లైట్లను మాత్రమే ఉపయోగించాలి.
2. వాహన వేగాన్ని తగ్గించి నెమ్మదిగా, అప్రమత్తంగా నడపాలి.
3. ముందున్న వాహనానికి సాధారణం కంటే ఎక్కువ దూరం పాటించాలి.
4. విండ్‌షీల్డ్‌పై ఆవిరి పేరుకుపోకుండా డిఫాగర్ ఉపయోగించాలి.
5. పొగమంచులో హజార్డ్ లైట్లను నిరంతరం ఉపయోగించకుండా, అవసరమైనప్పుడు మాత్రమే వినియోగించాలి.
6. పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు, మలుపుల వద్ద ఓవర్‌టేక్ చేయకూడదు.
7. రహదారిపై లేన్ మార్కింగ్‌లు, రిఫ్లెక్టర్లను గమనిస్తూ ప్రయాణించాలి.
8. ప్రయాణానికి ముందు వైపర్లు, లైట్లు, బ్రేకులు సక్రమంగా పనిచేస్తున్నాయో తనిఖీ చేసుకోవాలి.
9. అకస్మాత్తుగా బ్రేకులు వేయడం, వేగంగా మలుపులు తిరగడం చేయకూడదు.
వాహనదారులందరికీ సాధారణ సూచనలు:
- ప్రయాణానికి ముందుగానే బయలుదేరాలి. తొందరపాటు ప్రయాణాలు చేయకూడదు.
- వాహన హెడ్‌లైట్లు, అద్దాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
- ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతా సూచనలు తప్పనిసరిగా పాటించాలి.
- పొగమంచు కారణంగా రహదారి కనిపించని పరిస్థితుల్లో సురక్షితమైన ప్రదేశంలో వాహనాన్ని నిలిపి, పరిస్థితులు మెరుగుపడిన తర్వాత ప్రయాణం కొనసాగించాలి.
- మద్యం సేవించి వాహనాలు నడపకూడదు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదు.
శీతాకాలంలో పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమ ప్రయాణాన్ని సురక్షితంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


