విధుల్లో నిర్లక్ష్యం.. 14 మంది పోలీసులపై చర్యలు
ఐదుగురు హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్.. మరో తొమ్మిది మందిపై శాఖాపరమైన చర్యలు
బెల్లంపల్లి : విధి నిర్వహణ సమయంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ డ్యాన్స్ చేసిన బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐదుగురు సిబ్బందిని పోలీస్ కమిషనరేట్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరో తొమ్మిది మందిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. విధి సమయంలో బాధ్యతలను విస్మరించి వేడుకలు నిర్వహించడం పోలీస్ శాఖ క్రమశిక్షణకు, ప్రతిష్టకు భంగం కలిగించే చర్యగా కమిషనర్ పేర్కొన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం సహించరానిదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ వృత్తిపరమైన నిబద్ధతతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


