పిల్లలను పత్తి చేలలో పెట్టుకుంటే కేసులు నమోదు చేస్తాం తెల్కపల్లి ఎస్సై రమేష్
పత్తి చేల బాట పట్టిన 86 మంది విద్యార్థులకు విముక్తి మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి
తెలకపల్లి మండల కేంద్రంలోని లింగాల - తెలకపల్లి రహదారిలో గల పశువుల సంత సమీపంలో పత్తి చేలకు తరలివెళ్తున్న బాల కార్మికులకు అధికారులు విముక్తి కల్పించారు. దసరా సెలవులు ముగిసి పాఠశాలలు పునఃప్రారంభం అయినప్పటికీ కొంతమంది పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా పత్తి చేలకు వెళ్తున్నారనే సమాచారాన్ని కోనేరు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శనివారం జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, విద్యాశాఖ, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, పోలీస్ శాఖ సంయుక్తంగా దాడులు నిర్వహించి 86 మంది బాల కార్మికులను అడ్డుకుని తిరిగి పాఠశాలలకు పంపించారు. కొల్లాపూర్, మల్లచింతలపల్లి, నార్లాపూర్, సాతాపూర్, పెద్ద కార్పవుల, మరికల్, రాయిపాకుల, ఆలేరు, బొప్పల్లి, గౌరెడ్డిపల్లి, పెద్దకొత్తపల్లి తదితర గ్రామాల నుండి నిత్యం వివిధ వాహనాల్లో పత్తి చేలకు తరలి వెళ్తున్నారు. అనంతరం పిల్లలకు, తల్లిదండ్రులకు, వాహన డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ - పిల్లలను పత్తి చేలకు తీసుకువెళ్తే డ్రైవర్లపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతిరోజూ పాఠశాలకు హాజరుకావాలని సూచించారు.
తెలకపల్లి ఎస్సై రమేష్ మాట్లాడుతూ - 18 సంవత్సరాల లోపు పిల్లలను పనులకు తరలించరాదని, కెపాసిటీకి మించి ప్రయాణికులను తరలిస్తే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిసిపిఓ శ్రీశైలం, గౌరెడ్డిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం శివప్రసాద్, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 యశ్వంత్, ఏఎస్సై శంకర్ రెడ్డి, కానిస్టేబుళ్లు శ్రీను, నాగరాజు, కోనేరు స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఆంజనేయులు, ఏరియా కోఆర్డినేటర్లు జాకీర్ హుస్సేన్, శ్రీనివాసులు, సోషల్ వర్కర్ శివుడు, సీఆర్పీ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


