హుస్నాబాద్‌లో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చొరవను అభినందించిన కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను తగ్గించేందుకు హుస్నాబాద్‌లో చేపట్టిన కార్యక్రమంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కేంద్ర మంత్రి లేఖ
హుస్నాబాద్ విజన్:ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో జరిగే శుభకార్యాలు, ఇతర సామూహిక కార్యక్రమాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించేందుకు ‘స్టీల్ బ్యాంక్’ ఏర్పాటు చేయాలనే రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ చొరవను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ప్రస్తావించారు.ఈ మేరకు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ లేఖ రాశారు. గ్రామాల్లో జరిగే శుభకార్యాలు, ఇతర వేడుకల్లో వినియోగించుకునేందుకు స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రల పూర్తి సెట్లతో ‘స్టీల్ బ్యాంక్’ ఏర్పాటు చేయాలనే ఆలోచన ప్లాస్టిక్ వినియోగాన్ని, ప్లాస్టిక్ వ్యర్థాలను క్షేత్రస్థాయిలో తగ్గించేందుకు దోహదపడుతుందని లేఖలో పేర్కొన్నారు.ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని కేంద్ర మంత్రి వివరించారు. అధిక కాలుష్యానికి కారణమయ్యే,తక్కువ ఉపయోగం కలిగిన గుర్తించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం, ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌పై ఉత్పత్తిదారుల విస్తరించిన బాధ్యత (EPR) అమలు, వస్తువులను తిరిగి వినియోగించడం, పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం వంటి చర్యలు ఇందులో భాగమని తెలిపారు.ప్లాస్టిక్‌కు పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తయారు చేసిన ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయాల తయారీదారులు, విక్రేతల సంకలనం’ (Compendium of Manufacturers/Sellers of Eco-alternatives)ను 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ సంకలనం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని తెలిపారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలతో పాటు సమాజంలోని అన్ని వర్గాలు సమన్వయంతో కృషి చేస్తే ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ వల్ల కలిగే కాలుష్యాన్ని సమర్థవంతంగా, స్థిరమైన పద్ధతుల్లో నియంత్రించవచ్చని కేంద్ర మంత్రి తన లేఖలో అభిప్రాయపడ్డారు.గ్రామీణ స్థాయిలో పర్యావరణ పరిరక్షణకు ‘స్టీల్ బ్యాంక్’ ఒక ఉపయోగకరమైన ఆలోచనగా నిలుస్తుంది. శుభకార్యాల్లో స్టీల్ పాత్రలను తిరిగి వినియోగించడం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించాలనే లక్ష్యంతో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చేపట్టిన ఈ చొరవ పర్యావరణహిత జీవన విధానాల ప్రోత్సాహానికి దోహదపడనుంది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


