నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త!
అన్నను పోగొట్టుకున్న ఇంటిలో నేడు కన్నతల్లే కానరాని లోకాలకు!
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మర్రిగూడ పోలీసులు
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
నల్గొండ/మర్రిగూడ:అయ్యో దేవుడా.. ఏడాది కిందట పెద్ద కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆ తల్లిదండ్రులు పడిన వేదన అంతా ఇంతా కాదు. ఆ బాధ నుంచి ఆ కుటుంబం పూర్తిగా కోలుకోకముందే.. మరో పెనువిషాదం వారి ఇంట చీకట్లు నింపింది.క్షణికావేశంలో ఒకరు తీసుకున్న తప్పుడు నిర్ణయం..ఆ ఇంట పచ్చని సంసారాన్ని నేలమట్టం చేసింది. భార్యాభర్తల మధ్య చెలరేగిన చిన్నపాటి మనస్పర్థలు చివరకు కన్నతల్లి ప్రాణాలనే బలితీసుకున్నాయి.ఫలితంగా ఇద్దరు పిల్లలు అనాథలుగా మారి రోడ్డున పడ్డారు.నల్గొండ జిల్లా మర్రిగూడ మండల పరిధిలోని శివన్నగూడెం గ్రామంలో శనివారం చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికులను కలచివేసింది. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సుంకరి ఇంద్రయ్య(40), రజిత(36) అలియాస్ అనిత దంపతులకు 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం.
అయితే, ఏడాది క్రితం వీరి పెద్ద కుమారుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. కన్నపేగు తెగిపోయి పుట్టెడు శోకంలో ఉన్న ఆ తల్లిదండ్రులకు ఆ తర్వాత కాలం కష్టాలను తెచ్చిపెట్టింది. కుమారుడి మరణం తాలూకు విషాద ఛాయలు, కుటుంబ ఆర్థిక సమస్యలు ఆ దంపతుల మధ్య తరచూ గొడవలకు దారితీశాయి. మనస్పర్థలు రోజురోజుకూ పెరుగుతూ వచ్చాయి.
శనివారం ఉదయం కూడా వీరిద్దరి మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం చెలరేగింది. కుటుంబ కలహాల ?ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది?క్షణికావేశానికి దారితీయడంతో ఇంద్రయ్య విచక్షణ కోల్పోయాడు. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ ఇంట్లోనే ఉన్న పదునైన మారణాయుధంతో భార్య అనిత మెడపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావం కావడంతో అనిత ఘటనా స్థలంలోనే కుప్పకూలి ప్రాణాలు విడిచింది.
సమాచారం అందుకున్న వెంటనే మర్రిగూడ ఎస్సై బి.రాంబాబు,సీఐ డి.రాజు తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు.
కన్నీరు పెట్టిస్తున్న పిల్లల రోదనలు..
కొద్ది రోజుల క్రితం గుండెలకు హత్తుకునే అన్నను కోల్పోయి తీరని వేదనలో ఉన్న ఆ చిన్నారులకు, ఇప్పుడు కష్టకాలంలో భరోసా ఇవ్వాల్సిన తండ్రి నేరస్థుడిగా మారి కటకటపాలయ్యాడు. కన్నతల్లేమో హత్యకు గురై విగతజీవిగా మారింది. అమ్మానాన్నల ప్రేమకు దూరమై, దిక్కుతోచని స్థితిలో ఆ పసిపిల్లలు గుండెలు పగిలేలా రోధిస్తున్న తీరు అక్కడ ఉన్న ప్రతీ ఒక్కరి చేత కంటతడి పెట్టించింది.
మానవ సంబంధాల క్షీణతకు అద్దం పడుతున్న ఘటనలు..
సమాజంలో నేడు మానవ సంబంధాలు ఎంతలా దిగజారిపోతున్నాయో ఈ ఘటన మరోసారి కళ్లకు కడుతోంది. చిన్నపాటి మనస్పర్థలు, కోపతాపాలు క్షణంలో ఎంతటి ఘోరాలకు దారి తీస్తాయో చెప్పడానికి ఇదొక నిదర్శనంగా నిలిచింది. సమస్య ఏదైనా చర్చలతో పరిష్కరించుకోవాలి తప్ప, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు నిండు ప్రాణాలను తీయడమే కాకుండా, పసిపిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాయని మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాల్లో సంయమనం, పెద్దల జోక్యంతో సమస్యలను పరిష్కరించుకునే ఓర్పు ఎంతైనా అవసరమని ఈ విషాదం మరోసారి హెచ్చరిస్తోంది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

