పేకాట స్థావరానికి స్థలం కల్పించిన మిట్టల్ జిన్నింగ్ మిల్లు యజమానిపై కేసు నమోదు
మిట్టల్ జిన్నింగ్ మిల్లు జప్తు కోసం ఆర్డీవోకు లేఖ
చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సహకరించిన వారిపై కఠిన చర్యలు – ఇంద్రవెల్లి ఎస్‌హెచ్‌ఓ ఈ. సాయన్న
ఇంద్రవెల్లి మండలంలోని ఈనెల 21న పాడుబడ్డ మిట్టల్ జిన్నింగ్ మిల్లు ప్రాంగణంలో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించి 14 మందిని అరెస్టు చేసిన ఘటనలో, పేకాటకు స్థలం కల్పించిన జిన్నింగ్ మిల్లు యజమాని గోరేసేట్ పై సైతం కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ఎస్‌హెచ్‌ఓ ఈ. సాయన్న తెలిపారు.
ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 14 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.2,24,100 నగదు, 14 మొబైల్ ఫోన్లు, 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. విచారణలో జిన్నింగ్ మిల్లు యజమానికి తెలిసే అక్కడ పేకాట ఆడినట్లు వెల్లడికావడంతో, అతనిపై కూడా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగించిన జిన్నింగ్ మిల్లును జప్తు చేయాలని కోరుతూ సంబంధిత ఆర్డీవోకు లేఖ అందజేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ ఈ. సాయన్న వెల్లడించారు.
ప్రజలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, పేకాట, గంజాయి, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారితో పాటు వాటికి సహకరించే వారిపైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఇంద్రవెల్లి ఎస్‌హెచ్‌ఓ ఈ. సాయన్న హెచ్చరించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

