ఇంటి తాళం పగులగొట్టి వెండి పట్టీలు, నగదు చోరీ చేసిన నిందితుడి అరెస్ట్
చోరీకి గురైన వెండి పట్టీలు, రూ.10,130 నగదు, ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్ స్వాధీనం
నిందితునిపై గతంలో సైతం దొంగతనం కేసులు నమోదు..తలమడుగు ఎస్‌హెచ్‌ఓ డి. రాధిక
ఆదిలాబాద్ తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడు మాకల రాజు 35 తలమడుగు మండలం దేవాపూర్ ను త లమడుగు పోలీసులు అరెస్ట్ చేసి, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తలమడుగు ఎస్ఐ డి రాధిక తెలియజేశారు.
వివరాలలో
ఈ నెల 21 న రాత్రి దేవాపూర్ గ్రామంలో శారదాదేవి విగ్రహ నిమజ్జన ఊరేగింపు జరుగుతున్న సమయంలో గ్రామానికి చెందిన అంగ రాజు తన భార్య, పిల్లలతో కలిసి ఊరేగింపుకు వెళ్లాడు. తిరిగి అర్ధరాత్రి ఇంటికి వచ్చి చూడగా బీరువా తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించాడు. పరిశీలించగా మూడు తులాల వెండి పట్టీలు, రూ.15,000 నగదు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు తలమడుగు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా ఈ నెల 24న ఉదయం కజ్జర్ల ఎక్స్‌రోడ్డు సమీపంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని పట్టుకుని విచారించారు. అతడు ఆదిలాబాద్‌లోని కేఆర్‌కే కాలనీకి చెందిన మాకల రాజు (35), ప్రస్తుతం దేవాపూర్‌లో ఉంటున్నట్లు గుర్తించారు. విచారణలో చోరీకి పాల్పడినట్లు వెల్లడైంది.
నిందితుడి వద్ద నుంచి మూడు తులాల వెండి పట్టీలు, రూ.10,130 నగదు, హోండా యాక్టివా ద్విచక్ర వాహనం, రెడ్‌మీ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన నగదులో కొంత ఖర్చు చేసినట్లు విచారణలో వెల్లడైంది.
ఈ సందర్భంగా తలమడుగు ఎస్‌హెచ్‌ఓ డి. రాధిక మాట్లాడుతూ, గ్రామాల్లో ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. నేరాల నియంత్రణకు పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


