దుదేకుల ఆత్మగౌరవ భవన్ నిర్మాణానికి రూ.3 కోట్ల నిధులు మంజూరు
కోకాపేటలో 2 ఎకరాల స్థలంలో భవన నిర్మాణానికి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మహమ్మద్ రాజమ్మద్ కృతజ్ఞతలు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ముస్లిం దూదేకుల సామాజిక వర్గం చిరకాల స్వప్నం సాకారం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దుదేకుల సామాజిక వర్గం ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే దుదేకుల ఆత్మగౌరవ భవన్ నిర్మాణానికి రూ.3 కోట్ల పరిపాలనాపరమైన నిధులను మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జారీ చేసిన G.O.Ms.No.51, తేదీ: 02-11-2026 ప్రకారం రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం, కోకాపేట గ్రామ పరిధిలోని HMDA లేఅవుట్లో సర్వే నంబర్ 240, ప్లాట్ నంబర్ 12లో కేటాయించిన 2 ఎకరాల స్థలంలో ఈ భవనాన్ని నిర్మించనున్నారు.
భవన నిర్మాణ పనులను తెలంగాణ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGEWIDC) లేదా ఇతర సమర్థవంతమైన ప్రభుత్వ నిర్మాణ సంస్థకు అప్పగించాలని ప్రభుత్వం ఆదేశించింది. మంజూరైన రూ.3 కోట్ల నిధులతో భవన నిర్మాణంతో పాటు విద్యుత్, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం తదితర అన్ని మౌలిక సదుపాయాలను కల్పించి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముస్లిం దూదేకుల బీసీ సంక్షేమ సంఘం వైస్ చైర్మన్ మహమ్మద్ రాజమ్మద్ హర్షం వ్యక్తం చేశారు. దుదేకుల సామాజిక వర్గం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఆత్మగౌరవ భవన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో దుదేకుల సామాజిక వర్గానికి ఆత్మగౌరవ భవన్ కల్పించాలనే డిమాండ్ నెరవేరలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశంపై సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
దుదేకుల సామాజిక వర్గం విద్యా, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ఈ భవన్ ఒక వేదికగా నిలుస్తుందని రాజమ్మద్ ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో విద్యార్థులకు మార్గదర్శకత్వం, యువతకు నైపుణ్యాభివృద్ధి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలపై అవగాహన, సామాజిక సమావేశాలు, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
దుదేకుల సామాజిక వర్గం ఆత్మగౌరవానికి గుర్తుగా కోకాపేటలో నిర్మించనున్న ఈ భవన్ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్రంలోని దుదేకుల సోదరులు, మహిళలు, యువత ఈ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారని, తమ సామాజిక వర్గానికి గుర్తింపు, గౌరవం కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని మహమ్మద్ రాజమ్మద్ పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

