నా తెలంగాణ కోటి రతనాల వీణ... గంగారం ఉన్నత పాఠశాలలో మార్మోగిన దాశరథి 49వ స్మృతి
బిజినపల్లి(నాగర్ కర్నూల్) : బిజినపల్లి మండల పరిధిలోని గంగారం ఉన్నత పాఠశాలలో గురువారం ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్యుల 40వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలకృష్ణారెడ్డి మరియు మహనీయుల స్ఫూర్తి వేదిక రాష్ట్ర చైర్మన్, ప్రజా వాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ మాట్లాడారు.వారు మాట్లాడుతూ "నా పేరు ప్రజాకోటి, మా ఊరు ప్రజావాణి" అని ప్రకటించిన ప్రళయ కవితామూర్తి దాశరథి అని, తన కవితలతో, గేయాలతో తెలంగాణ ప్రజల గుండె చప్పుడును నిజాంకు వినిపించిన నిప్పురవ్వ దాశరథి అని కొనియాడారు.
"నా తెలంగాణ కోటి రతనాల వీణ" అంటూ నినదించిన ధిక్కార స్వరం దాశరథి అని, అక్షరాలను ఆయుధాలుగా మలచి నిజాం నిరంకుశత్వంపై అగ్నిధార కురిపించిన యోధుడని తెలిపారు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకుని భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన పోరుబిడ్డ దాశరథి అని, నిజాం ప్రభుత్వం చేత జైలు శిక్ష అనుభవించిన స్వాతంత్ర్య సమరయోధుడు, అభ్యుదయ కవి, మానవతావాది అని గుర్తుచేశారు.అగ్నిధార, రుద్రవీణ, మార్పు నా తీర్పు, నేత్రపర్వం, గాలిపాటలు వంటి కవితా సంపుటాలు రచించడంతో పాటు, సినీ గేయ రచయితగా ఎన్నో పాటలు రాసి సమాజాన్ని ప్రభావితం చేసిన ప్రజాకవి దాశరథి అని, కవులు ప్రజల కోసమే కవిత్వం రాయాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలను చైతన్యం చేయాలని ఈ సందర్భంగా ప్రజా కవులను కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రత్నశేఖర్, రాజప్ప, మహమ్మద్, కొములయ్య, శ్రీకాంత్ రెడ్డి, నందకిషోర్, ఇందుమతి, ఊర్మిళ, నితీష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


