రిఫరల్ హాస్పిటల్‌గా నిజామాబాద్ జీజీహెచ్
On
రిఫరల్ హాస్పిటల్‌గా నిజామాబాద్ జీజీహెచ్
త్వరలో అందుబాటులోకి రానున్న సూపర్ స్పెషాలిటీ సర్వీసులు
అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎంఆర్‌ఐ సేవలు
జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశంలో వెల్లడించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌ను ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే రిఫరల్సెంటర్‌గా తీర్చిదిద్దుతున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఇక్కడ త్వరలోనే కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీతో పాటు ఇతర సూపర్ స్పెషాలిటీ సేవలను దశలవారీగా ప్రారంభిస్తామని వెల్లడించారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఎంఆర్‌ఐ యంత్రాన్ని కొనుగోలు చేస్తున్నామని, త్వరలోనే ఎంఆర్‌ఐ సేవలను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
ఈ మేరకు సోమవారం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్‌లో నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి సమీక్ష సమావేవం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జనరల్ హాస్పిటల్, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీలు), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), సబ్ సెంటర్ల పనితీరు, ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులు, వైద్య సిబ్బంది, అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. ప్రజాప్రతినిధులు చేసిన సూచనలు, హాస్పిటళ్ల అభివృద్ధి, పేషెంట్ల అవసరాలను ఒక్కొక్కటిగా తెలుసుకుని సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రభుత్వ హాస్పిటళ్లపై ప్రజల విశ్వాసం గణనీయంగా పెరిగిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. నిమ్స్, గాంధీ, ఉస్మానియా, నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లలో బెడ్ల కోసం ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలకు ఫోన్లు వస్తున్నాయని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జిల్లాల్లోని ప్రభుత్వ హాస్పిటళ్లను మరింత బలోపేతం చేస్తే హైదరాబాద్‌లోని ప్రధాన హాస్పిటళ్లపై రోగుల ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.
ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అవసరాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అంకాపూర్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని కోరగా, దానికి మంత్రి సానుకూలంగా స్పందిస్తూ పీహెచ్‌సీ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నందిపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా అప్‌గ్రేడ్ చేయాలని, ఇందల్వాయిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు చేసిన ప్రతిపాదనలను కూడా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టిందని మంత్రి వెల్లడించారు. ఇటీవలే జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటళ్లలో 18 మంది గైనకాలజిస్టులు, 22 మంది అనస్థీషియా స్పెషలిస్టులు, 22 మంది పిల్లల వైద్య నిపుణులను నియమించామని తెలిపారు. అదేవిధంగా సుమారు 330 మంది నర్సింగ్ ఆఫీసర్లను పోస్టింగ్ ఇచ్చామని చెప్పారు. ఈ నెలాఖరు నాటికి జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, రేడియాలజీ తదితర విభాగాల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకాలు పూర్తి చేస్తామని, జిల్లాలో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ హాస్పిటళ్లలో మానవ వనరులు (హెచ్‌ఆర్), మౌలిక వసతులు, అత్యాధునిక వైద్య పరికరాలు, మెడిసిన్స్, డయాగ్నస్టిక్ సేవలను సమగ్రంగా బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా ప్రజాప్రతినిధులు కూడా తమ పరిధిలోని ప్రభుత్వ హాస్పిటళ్ల అభివృద్ధికి సహకరించాలని కోరారు.
సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పి. సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి, రేకులపల్లి భూపతి రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, డాక్టర్ ఎన్. వాణి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ రవీందర్ నాయక్, నిజామాబాద్ డీఎంహెచ్‌వో, నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Views: 17
About The Author

Tags:

Error on ReusableComponentWidget
Latest News
04 Aug 2026 18:44:58
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
