బాపూఘాట్‌లో గాంధీజీకి ఘన నివాళులు
హైదరాబాద్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌లో ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కలిసి మహాత్మా గాంధీ స్మారకానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం గాంధీజీ విగ్రహానికి పుష్పాలు సమర్పించి, నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా బాపూఘాట్‌లో ఏర్పాటు చేసిన డిజిటల్ మ్యూజియంను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి ప్రారంభించారు. గాంధీజీ జీవితం, ఆయన సిద్ధాంతాలు, స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను ప్రజలకు మరింత చేరువ చేసేలా డిజిటల్ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. మహాత్మా గాంధీ సత్యం, అహింస, శాంతి, మానవతా విలువలను ప్రపంచానికి చాటారని ఈ సందర్భంగా నాయకులు స్మరించారు. సమాజంలో శాంతి, ఐక్యత, సోదరభావం, సేవా భావాలను పెంపొందించడంలో గాంధీజీ ఆలోచనలు నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.బాపూఘాట్‌లోని ఈ ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యత ఉంది. 1948లో మహాత్మా గాంధీ చితాభస్మంలో కొంత భాగాన్ని మూసీ–ఈసా నదుల సంగమ ప్రాంతంలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మహమ్మద్ అజారుద్దీన్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలు గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వ సలహాదారులు వి. హనుమంతరావు, హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ విప్‌లు అద్దంకి దయాకర్, రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్ పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొని మహాత్ముడికి నివాళులర్పించారు. గాంధీ జయంతి సందర్భంగా బాపూఘాట్‌లో జరిగిన కార్యక్రమం ద్వారా సత్యం, అహింస, శాంతి, మానవతా విలువలను మరోసారి స్మరించుకున్నారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


