ఇది పేదల ప్రభుత్వం.. పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుంది:ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
డిచ్పల్లి మండలంలో 790 మంది లబ్ధిదారులకు చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ
దివ్యాంగులకు నెలకు రూ.4,016, ఇతర అర్హులకు రూ.2,016 చొప్పున పింఛన్
రూరల్ నియోజకవర్గంలో కొత్తగా 3 వేల మందికి పైగా పింఛన్లు మంజూరు
నియోజకవర్గాన్ని గుడిసెలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ప్రతి గింజను కొనుగోలు చేస్తాం
మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు వడ్డీలేని రుణాలు, ఉపాధి అవకాశాలు
నిజామాబాద్ నవంబర్17:( విజన్ ఆంధ్ర)
అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా, ఎలాంటి పైరవీలకు తావులేకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను కొనసాగిస్తోందని పేర్కొన్నారు.
మంగళవారం డిచ్పల్లి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే 790 మంది లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు.
790 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు
డిచ్పల్లి మండల పరిధిలో మొత్తం 790 మంది లబ్ధిదారులకు నూతనంగా పింఛన్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. వీరిలో 435 మంది వితంతువులు, 96 మంది ఒంటరి మహిళలు, 230 మంది దివ్యాంగులు, 28 మంది గీత కార్మికులు, ఒకరు చేనేత కార్మికులు ఉన్నారని వివరించారు. దివ్యాంగులకు నెలకు రూ.4,016, మిగతా అర్హులైన లబ్ధిదారులకు నెలకు రూ.2,016 చొప్పున ప్రభుత్వం పింఛన్లు అందిస్తోందన్నారు.
జిల్లా వ్యాప్తంగా 20 వేల మందికి పైగా కొత్త లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు కాగా, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోనే 3 వేల మందికి పైగా కొత్తగా పింఛన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. పింఛన్ల మంజూరులో కొంత ఆలస్యం జరిగినప్పటికీ అర్హులైన ప్రతి ఒక్కరికీ తప్పకుండా పింఛన్ అందిస్తామని భరోసా ఇచ్చారు. పింఛన్లు అందుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ చరిత్ర త్యాగాల చరిత్ర
డిచ్పల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం, కార్యకర్తల బలం ఉందని ఎమ్మెల్యే అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం, దేశ నిర్మాణం కోసం ప్రాణత్యాగాలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వంటి మహానాయకులు దేశం కోసం చేసిన సేవలను గుర్తుచేశారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పింఛన్లు, సంక్షేమ పథకాలు కేవలం ప్రకటనలు, కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజాపాలనకు నిదర్శనంగా నిలుస్తోందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు రూ.9 లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్లిందని, ఆ అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే అనేక ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ సంక్షేమం, అభివృద్ధిని సమర్థవంతంగా కొనసాగిస్తున్నామని వివరించారు.
మహిళా సంక్షేమానికి పెద్దపీట
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటివరకు ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రూ.13 వేల కోట్లకు పైగా చెల్లించిందన్నారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని పేర్కొన్నారు.
గత పదేళ్లలో పేదలకు కొత్త రేషన్ కార్డులు అందించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు అందిస్తూ, సన్నబియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తోందన్నారు. కిలో సన్నబియ్యానికి రూ.52 చెల్లించి ప్రజలకు ఉచితంగా అందిస్తున్నామని వివరించారు.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.79 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందించామని, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 150కి పైగా మహిళా సంఘ భవనాలను మంజూరు చేశామని చెప్పారు. మహిళా సంఘాలు బస్సులను అద్దెకు తీసుకుని నెలకు రూ.70 వేల వరకు ఆదాయం పొందేలా అవకాశాలు కల్పిస్తున్నామని, పెట్రోల్ బంకులు, ఇతర వ్యాపారాలు నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు.
ఈ నెల 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు.
ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తున్నాం
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటికే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 3,500 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, రెండో విడతలో మరో 2,500 ఇళ్ల నిర్మాణానికి రంగం సిద్ధమైందని చెప్పారు. మొత్తంగా నియోజకవర్గంలో 6 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారుల కుటుంబాల్లో కనిపిస్తున్న ఆనందం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. రూరల్ నియోజకవర్గాన్ని గుడిసెలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇంటి స్థలం లేని పేదలకు 75 గజాల స్థలం కేటాయించి ఇళ్లు నిర్మించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు.
రైతులకు గిట్టుబాటు ధర.. ప్రతి గింజ కొనుగోలు
రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్‌కు శ్రీకారం చుడితే, నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులతో పాటు గృహ అవసరాలకు కూడా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోందన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టితో రైతులు పండించిన వరి ధాన్యానికి గిట్టుబాటు ధర లభిస్తోందని, క్వింటాల్ ధాన్యానికి రూ.3 వేల కంటే తక్కువ ధరకు విక్రయించవద్దని రైతులకు సూచించారు. మరో రెండు రోజుల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనుందని, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు.రైతును రాజు చేయాలంటే పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని, అప్పుడే రైతు కుటుంబాల్లో ఆర్థిక సంతోషం వెల్లివిరుస్తుందని అన్నారు. రైతులకు ఎకరానికి సుమారు రూ.1.20 లక్షల వరకు ఆదాయం వచ్చేలా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
ఎల్‌నినో ప్రభావంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. భూగర్భ జలమట్టాలు తగ్గుతున్నందున నీటిని పొదుపుగా వినియోగించాలని, రెండో పంటగా వరి సాగు చేయకుండా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. వ్యవసాయానికి అందుబాటులో ఉన్న నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ కూలీలకు ఉపాధి తగ్గుతుందనే ఆందోళన నేపథ్యంలో ఉపాధి హామీ పథకం కింద పనిదినాలను 100 నుంచి 150 రోజులకు పెంచినట్లు తెలిపారు. కూలీలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
విద్య, గ్రామీణ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత
విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తూ నాణ్యమైన ఉచిత విద్య అందిస్తున్నామని చెప్పారు.నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మల్కాపూర్‌లో సుమారు రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు సంబంధించిన చర్యలు కూడా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, ఇతర సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు.
ప్రతిపక్షాల విమర్శలకు కాదు.. ప్రజలకు జవాబుదారీగా ఉంటాం
కాంగ్రెస్ ప్రభుత్వం 2047 రైజింగ్ తెలంగాణ లక్ష్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తోందని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్ష బీజేపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు. కేంద్రంలో 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు చేసిన అభివృద్ధి ఏమిటో స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రజలకు వివరించాలని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రూ.30 వేల కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వ సహకారం కోరినా స్పందన లేదని విమర్శించారు. తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం స్థానిక బీజేపీ ఎంపీ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని హితవు పలికారు.
ప్రతిపక్షాలు చేసే విమర్శలు, చిల్లర రాజకీయాలకు స్పందించాల్సిన అవసరం తమకు లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉంటుందని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, మాజీ ఐసీడీఎంఎస్ చైర్మన్ సాయారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంబర్ సింగ్, పొలసాని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ నర్సయ్య, సర్పంచుల ఫోరం రూరల్ నియోజకవర్గ అధ్యక్షుడు వాసు, అమృతాపూర్ గంగాధర్, ఉమ్మాజి నరేష్, ధర్మాగౌడ్, యాదగిరి, చాంగుబాయి, తారాచంద్ నాయక్, షాదుల్లా, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

