ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు ఊరట.. జీవో 157 జారీపై TSPALA హర్షం

సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే పాలిటెక్నిక్ కళాశాలల కొనసాగింపు సీఎం రేవంత్ రెడ్డికి అధ్యాపక సంఘం కృతజ్ఞతలు

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు ఊరట.. జీవో 157 జారీపై TSPALA హర్షం

కొత్తగూడెం :  ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను యథావిధిగా సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 157 జారీ చేయడంపై తెలంగాణ స్టేట్ ఆల్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్ (TSPALA) హర్షం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం పాలిటెక్నిక్ విద్యావ్యవస్థకు, అధ్యాపకులకు, విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందని అసోసియేషన్ పేర్కొంది.
గతంలో జూన్ 16న జారీ చేసిన జీవో 97 ద్వారా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై అధ్యాపకులు, విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విలీన ప్రక్రియ అమలైతే పాలిటెక్నిక్ విద్యావ్యవస్థకు, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు, అధ్యాపకులు, అధికారుల ప్రయోజనాలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో అధ్యాపకులు, విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు, ఉద్యమాలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి గత జీవో 97ను రద్దు చేస్తూ జీవో 157 జారీ చేయడం పట్ల TSPALA నాయకులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసిన విద్యాశాఖ కార్యదర్శి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే హైలెవల్ కమిటీ సలహాదారు కె. కేశవరావు, కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, నవీన్ మిట్టల్‌తో పాటు సహకరించిన ఉన్నతాధికారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
జీవో 97 రద్దు కోసం మొదటి నుంచి చివరి వరకు పోరాటం చేసిన తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసీ (TPJAC) నాయకులకు, వివిధ విద్యార్థి సంఘాల ప్రతినిధులకు, ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ విజయం ఏ ఒక్కరి వల్లనో సాధ్యమైనది కాదని, అధ్యాపకులు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు, జేఏసీ నాయకులు, ఉన్నతాధికారుల సమిష్టి కృషి, ఐక్యత, పట్టుదలకు దక్కిన ఫలితమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ సానుకూల నిర్ణయం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల స్వతంత్ర గుర్తింపును, సాంకేతిక విద్యాశాఖలో వాటి కొనసాగింపును కాపాడటమే కాకుండా, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు, తెలంగాణ సాంకేతిక విద్యాభివృద్ధికి మరింత బలాన్ని చేకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

*TSPALA నాయకత్వ బృందం:*
1. జి. ఉదయ్ భాస్కర్ – అధ్యక్షుడు, TSPALA, కో-చైర్మన్, TPJAC
2. టి. నవీన్ కుమార్ – జనరల్ సెక్రటరీ
3. జి. సునీల్ కుమార్ – అసోసియేట్ ప్రెసిడెంట్
4. పి. శ్రీలత – ట్రెజరర్
5. జి. రామకృష్ణ – ఆర్గనైజింగ్ సెక్రటరీ
6. జి. మమత – ఉమెన్ సెక్రటరీ, హైదరాబాద్ ఇన్‌చార్జ్

ఈ మేరకు TSPALA అధ్యక్షుడు, TPJAC కో-చైర్మన్ జి. ఉదయ్ భాస్కర్‌తో పాటు అసోసియేషన్ నాయకత్వ బృందం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేసింది.

Views: 155

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News