జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలి – ఆర్‌ఎస్‌పీ డిమాండ్
RMO కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన ఆర్‌ఎస్‌పీ జిల్లా నాయకులు
నిజామాబాద్ : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సదుపాయాలను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్‌ఎస్‌పీ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి RMO కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌పీ జిల్లా కార్యదర్శి కటారి రాములు మాట్లాడుతూ, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల రక్త పరీక్షలు (బ్లడ్ టెస్టులు) అందుబాటులో లేకపోవడంతో పేద, మధ్యతరగతి రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అనేక పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయించాల్సి రావడంతో వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఆసుపత్రిలో కార్డియాలజీ (గుండె సంబంధిత) మరియు న్యూరాలజీ (నాడీ సంబంధిత) నిపుణులైన వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర వైద్యం అవసరమైన రోగులు సరైన చికిత్స పొందలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఆర్ఐ (MRI) స్కానింగ్ సదుపాయం లేకపోవడం అత్యంత ఆందోళనకరమని అన్నారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో రోగులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోందని, అక్కడ వేల రూపాయలు వసూలు చేస్తూ నిరుపేద ప్రజలను ఆర్థికంగా దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రులు పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాల్సిన సమయంలో అవసరమైన రక్త పరీక్షలు, ఎంఆర్ఐ సదుపాయం, నిపుణులైన వైద్యులు లేకపోవడం వల్ల రోగుల ప్రాణాలే ప్రమాదంలో పడుతున్నాయని అన్నారు. కాబట్టి ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే స్పందించి అన్ని రకాల పరీక్షలు, ఎంఆర్ఐ యంత్రం, అవసరమైన స్పెషలిస్ట్ వైద్యులను నియమించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌పీ జిల్లా నాయకులు పిట్ల నరేష్, గోపాల్ సింగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

