ఉపాధి హామీ పనులతో గ్రామీణాభివృద్ధికి బాటలు వేయాలి - కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
కల్వకుర్తి మండలం పంజాగులలో ఉపాధి హామీ పనుల పరిశీలన మహిళా సంఘం షేడ్‌నెట్ సాగు యూనిట్‌ను ప్రారంభించిన కలెక్టర్
నాగర్‌కర్నూల్ : ఉపాధి హామీ పనులతో గ్రామీణాభివృద్ధికి బాటలు వేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులకు సూచించారు.
కూలీలకు నిరంతరం ఉపాధి కల్పించేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని, గ్రామాల్లో శాశ్వత ఆస్తుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఫామ్ పాండ్లు, నీటి సంరక్షణ పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని, ఉపాధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు.
కల్వకుర్తి మండలం పంజాగులలో ఉపాధి హామీ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఫామ్ పాండ్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
పంజాగులలో మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షేడ్‌నెట్ సాగు యూనిట్‌ను కలెక్టర్ పరిశీలించారు. 400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ.1.46 లక్షల వ్యయంతో షేడ్‌నెట్ హౌస్ ఏర్పాటు చేశారు. 50 శాతం సబ్సిడీ కింద రూ.73 వేల ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించారు.షేడ్‌నెట్‌లో ఆకుకూరలు, కీరదోస, క్యాప్సికం, తీగ టమాట సాగు చేస్తున్నట్లు మహిళా సంఘ సభ్యులు కలెక్టర్‌కు వివరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆధునిక వ్యవసాయ పద్ధతులను మహిళా సంఘాలు అందిపుచ్చుకోవాలని అన్నారు. షేడ్‌నెట్ సాగుతో మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని, మహిళా సంఘాలు సమష్టి కృషితో ఆర్థిక స్వావలంబన సాధించాలని తెలిపారు.తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు సాధించాలని, ప్రభుత్వ సబ్సిడీ పథకాలపై రైతులు, మహిళా సంఘాలు అవగాహన పెంచుకోవాలని సూచించారు. వ్యవసాయాన్ని ప్రణాళికాబద్ధమైన ఆదాయ వనరుగా తీర్చిదిద్దుకోవాలని, రైతులు ప్రత్యామ్నాయ సాగు విధానాలపై దృష్టి సారించాలని అన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


