ఘనంగా చేయూత పింఛన్ల పంపిణీ
మెదక్ : వితంతువులు, ఒంటరి మహిళలు,దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. మెదక్ మండలంలోని భూపతిపూర్ మున్నూరు కాపు ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల ప్రొసీడింగ్స్‌ను అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన వారికి చేయూత పింఛన్ల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని వివరించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల అవసరాలను గుర్తించి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. పేద కుటుంబాలకు ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, విద్యార్థులకు అల్పాహారం, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, చేయూత పింఛన్లు వంటి పథకాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించి, వారి జీవితాల్లో భరోసా కల్పించడమే లక్ష్యమని అన్నారు.
ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.కొత్తగా చేయూత పింఛన్లు మంజూరుకావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీడీవో, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ బెండే రమేష్, మెదక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగరాజు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు యాద గౌడ్, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


