డయల్ 112కు వచ్చిన ఫోన్ కాల్‌తో స్పందించి.. ఓ నిండు ప్రాణాన్ని కాపాడిన రామారెడ్డి పోలీసులు!
- సమయస్ఫూర్తితో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని రక్షించిన కానిస్టేబుళ్లు రాజు, కిరణ్
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డిపేట్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సొమవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు డయల్ 112కు ఫోన్ చేసి సమాచారం అందించారు.సమాచారం అందిన వెంటనే స్పందించిన రామారెడ్డి పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు రాజు, కిరణ్‌లు లొకేషన్ ఆధారంగా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే సదరు వ్యక్తి ఉరి బిగించుకుని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిని గమనించిన పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమయస్ఫూర్తితో స్పందించి అతడిని కిందికి దించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. అనంతరం అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించగా సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాలతో బయటపడ్డారు.
- జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..
ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదని, జీవితంలో ఎదురయ్యే సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉంటే క్షణికావేశానికి లోనుకాకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులతో చర్చించి సామరస్యంగా పరిష్కరించుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. జీవితం ఎంతో విలువైనదని, మనం సాధించాలనుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే ముందుగా మనం జీవించి ఉండాలని పేర్కొన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు సాగాలని, క్షణికావేశంలో ఆత్మహత్య వంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం పోలీసుల బాధ్యత అని, డయల్ 112 ద్వారా వచ్చిన సమాచారంపై తక్షణమే స్పందించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుళ్లు రాజు, కిరణ్‌లను జిల్లా ఎస్పీ అభినందించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు కాల్ చేయండి.. మీ ప్రాణాలకు, ఇతరుల ప్రాణాలకు విలువ ఇవ్వాలని సూచించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


