వైద్య విద్య, మౌలిక సదుపాయాల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు - ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ
కామారెడ్డి : కామారెడ్డి మెడికల్ కాలేజీ అభివృద్ధికి రూ.24.40 కోట్లు, తెలంగాణ పబ్లిక్ స్కూల్ కొరకు 10 కోట్లు మంజూరు అయ్యాయని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ తెలిపారు.వైద్య విద్య, మౌలిక సదుపాయాల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
త్వరలో క్రిటికల్ కేర్ సెంటర్, మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.24 కోట్ల 40 లక్షల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ వెల్లడించారు.మెడికల్ కాలేజీలో చేపట్టనున్న అభివృద్ధి పనులు, అదనపు మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన నిధుల వివరాలను ఆయన సోమవారం కాలేజీ ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 175, HM&FW (C2) ద్వారా ఈ నిధులను మంజూరు చేసిందని తెలిపారు. మెడికల్ కాలేజీ భవనాలు, బాలుర బాలికల వసతి గృహాలు, వంటశాల, డైనింగ్ హాల్, ప్రిన్సిపల్ క్వార్టర్స్, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, విద్యుత్, రహదారులు, డ్రైనేజీ, కాంపౌండ్ వాల్ తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిధులను వినియోగించనున్నట్లు వివరించారు.
- ఈ సందర్భంగా షబ్బీర్ మాట్లాడుతూ...
కామారెడ్డి మెడికల్ కాలేజీ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, వైద్య విద్యను బలోపేతం చేయడంతో పాటు సామాన్య, పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.మెడికల్ కాలేజీకి మంజూరైన రూ.24.40 కోట్లతో పలు కీలక అభివృద్ధి పనులు చేపట్టనున్నామని తెలిపారు.
- రూ.24.40 కోట్ల నిధులతో చేపట్టనున్న పనుల వివరాలు:
సివిల్ వర్క్స్: మెడికల్ కాలేజీ, బాలుర మరియు బాలికల హాస్టళ్లు, కిచెన్, డైనింగ్ హాల్, ప్రిన్సిపల్ క్వార్టర్స్‌కు సంబంధించిన సివిల్ పనులకు రూ.84 లక్షల 96 వేలు కేటాయించారు.
వాటర్ సప్లై, శానిటరీ పనులు: మెడికల్ కాలేజీ, బాలుర మరియు బాలికల హాస్టళ్లు, కిచెన్, డైనింగ్ హాల్, ప్రిన్సిపల్ క్వార్టర్స్‌లో నీటి సరఫరా, పారిశుద్ధ్య సదుపాయాల కోసం రూ.21 లక్షల 57 వేలు కేటాయించారు.
రోడ్లు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాలు: MCW రోడ్లు, వాటర్ డ్రైనేజీ, సంపు, మిషన్ భగీరథ కనెక్షన్, 33 కేవీ విద్యుత్ లైన్ షిఫ్టింగ్, 700 ఆర్ఎంటీ కాంపౌండ్ వాల్, బీటీ రోడ్డు నిర్మాణం తదితర పనులకు రూ.1 కోటి 10 లక్షలు కేటాయించారు.
ఎలక్ట్రిఫికేషన్, ఎలక్ట్రో మెకానికల్ సర్వీసెస్: విద్యుత్ సదుపాయాలు, ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ సంబంధిత పనులకు రూ.17 లక్షల 78 వేలు కేటాయించారు.LS ప్రొవిజన్స్ సివిల్ వర్క్స్: అదనపు సివిల్ పనుల కోసం రూ.1 కోటి 9 లక్షలు కేటాయించారు.అమ్యూనిటీస్, LS ప్రొవిజన్స్: సివిల్ వర్క్స్, వాటర్ సప్లై, శానిటరీ పనులకు రూ.1 కోటి 10 లక్షలు కేటాయించారు.
లిఫ్ట్ సదుపాయాలు: మెడికల్ కాలేజీలో రెండు లిఫ్టుల ఏర్పాటు సహా వివిధ అదనపు అభివృద్ధి పనులను కూడా ఈ నిధులతో చేపట్టనున్నట్లు తెలిపారు. నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారికి కామారెడ్డి ప్రజల తరఫున, మెడికల్ కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులు మరియు వైద్య సిబ్బంది తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.
- కామారెడ్డి మెడికల్ కాలేజీకి 32 పీజీ సీట్లు మంజూరు కావడం సంతోషకరం
కామారెడ్డి మెడికల్ కాలేజీ రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన వైద్య విద్యా సంస్థగా ఎదుగుతోందని, దీనికి అదనంగా 32 పీజీ సీట్లు మంజూరు కావడం ఎంతో సంతోషకరమైన విషయమని షబ్బీర్ అలీ అన్నారు. పీజీ సీట్ల మంజూరుతో వైద్య విద్యలో ఉన్నత చదువులకు మరిన్ని అవకాశాలు లభించడంతో పాటు, భవిష్యత్తులో నిపుణులైన వైద్యులను తయారు చేయడానికి ఈ కాలేజీ వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కామారెడ్డి మెడికల్ కాలేజీ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని, అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా కల్పిస్తుందని స్పష్టం చేశారు. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్య అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజనం అందించాలి ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, బోధనా సిబ్బంది, సంబంధిత అధికారులకు షబ్బీర్ అలీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.విద్యార్థులకు కేవలం నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా, వారి ఆరోగ్యం, సంక్షేమం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన మరియు పోషక విలువలతో కూడిన భోజనం అందించాలని కోరారు. మనం విద్యార్థులకు అందించే విద్య, సదుపాయాలు, మంచి భోజనం వారి భవిష్యత్తుకు పునాది అవుతాయి. ఇక్కడ చదువుకునే విద్యార్థులు రేపు దేశానికి సేవ చేసే వైద్యులుగా ఎదగాలి. పేద ప్రజలకు అండగా నిలిచే నిబద్ధత కలిగిన వైద్యులుగా వారు తయారవ్వాలి. అందుకు కాలేజీ యాజమాన్యం, బోధనా సిబ్బంది సమష్టిగా కృషి చేయాలి" అని ఆయన పేర్కొన్నారు.త్వరలో క్రిటికల్ కేర్ సెంటర్, మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ప్రారంభం
కామారెడ్డి వైద్య రంగ అభివృద్ధికి మరో ముందడుగుగా త్వరలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారి ద్వారా క్రిటికల్ కేర్ సెంటర్, మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్‌ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని షబ్బీర్ అలీ వెల్లడించారు.
వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తే అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు మెరుగైన చికిత్స అందించడంతో పాటు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ముఖ్యంగా పేద కుటుంబాలు అత్యవసర వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని పేర్కొన్నారు.కామారెడ్డి మెడికల్ కాలేజీని మరింత అభివృద్ధి చేసి, అన్ని రకాల వైద్య సేవలు అందించే స్థాయికి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని, కాలేజీ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ స్పష్టం చేశారు.కామారెడ్డి జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, వైద్య విద్యార్థులకు అత్యుత్తమ విద్యా వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్, ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఇలియాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఐరేనీ సందీప్, గూడెం శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రామ్మోహన్, మాజీద్, వాజిద్,
భూపతి, అంజద్, నీట్టు వెంకట్రావు, గంప ప్రసాద్, ఉరదండ ప్రవీణ్, సంతోష రావు, భరత్ టింకు, సోఫియాన్, డేవిడ్, వడ్ల సురేష్, అనిరుద్, అజ్మత్, ఖదీర్, అధికారులు మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


