అభివృద్ధికి ఆమడదూరం.. అక్షరాల కోసం ఆరాటం!
చిన్నారుల చదువుకు అమృత్ అండ.. కస్తాల ఫౌండేషన్ చేయూత
ఆదిలాబాద్, బ్యూరో : ఓవైపు అభివృద్ధి పరుగులు పెడుతున్న కాలం.. మరోవైపు ఆ గూడెంలో నేటికీ కనీస సౌకర్యాల ఆనవాళ్లే లేవు! బడికి వెళ్లాలంటే పది కిలోమీటర్లకు పైగా కాలినడక.. వర్షం వస్తే బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే దుస్థితి. కనీస రహదారి లేదు.. విద్యార్థులకు అవసరమైన వసతుల్లేవు.. కుటుంబాల్లో పేదరికం తాండవిస్తోంది. అయినా ఆ చిన్నారుల కళ్లలో చదువుకోవాలన్న ఆశ చావలేదు. వారి ఆశలకు అక్షరబాట వేస్తూ ఓ యువకుడు స్వచ్ఛందంగా పాఠాలు బోధిస్తుండగా.. మరోవైపు కస్తాల అరుణ్‌కుమార్ సేవా సంకల్పంతో వారికి చేయూతనందించారు. అభివృద్ధి వెలుగులు ఇంకా చేరని ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండల పరిధిలోని అడ్డగుట్ట సోనేరావు గూడెంలో విద్య కోసం సాగుతున్న ఈ పోరాటం ప్రత్యేకంగా నిలుస్తోంది.
*చదువుకు కష్టాల బాట......
ఈ కొలాం గిరిజన గూడెంలో విద్యార్థుల చదువు ఎన్నో సవాళ్ల మధ్య సాగుతోంది. సరైన రహదారి, రవాణా సదుపాయాలు లేక బడికి చేరుకోవాలంటే పది కిలోమీటర్లకు పైగా నడవాల్సిన పరిస్థితి. వర్షాకాలంలో గుట్ట దారులు మరింత ప్రమాదకరంగా మారి రాకపోకలు స్తంభించిపోతున్నాయి. మరోవైపు కుటుంబాలకు స్థిరమైన ఉపాధి లేకపోవడంతో తల్లిదండ్రులు కూలి పనులపై ఆధారపడి జీవిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల మధ్య పిల్లల చదువుకు అవసరమైన సామగ్రి సమకూర్చుకోవడం కూడా భారంగా మారుతోంది. ప్రతిభ, ఆసక్తి ఉన్నా సరైన ప్రోత్సాహం, వసతులు లేక చిన్నారుల విద్యకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.
*అమృత్.. అక్షరాల బాటసారి.......
ఇలాంటి పరిస్థితుల్లో అదే గ్రామానికి చెందిన అమృత్ అనే యువకుడు చిన్నారుల చదువుకు అండగా నిలుస్తున్నారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ప్రతిరోజూ స్వచ్ఛందంగా పిల్లలకు పాఠాలు బోధిస్తూ వారి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. చదువుపై ఆసక్తి పెంచుతూ చిన్నారులకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. మారుమూల గూడెంలో విద్యా వెలుగులు నింపేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం అభినందనీయం.
*కస్తాల ఫౌండేషన్ చేయూత......
అమృత్ చేస్తున్న సేవ గురించి తెలుసుకున్న కస్తాల రామకృష్ణ మనవడు కస్తాల అరుణ్‌కుమార్ స్పందించారు. కస్తాల రామకృష్ణ ఫౌండేషన్ ద్వారా సోనేరావు గూడెం విద్యార్థులకు అవసరమైన బ్లాక్‌బోర్డులు, పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లతో పాటు పండ్లను అందజేశారు. చిన్నారుల చదువుకు అవసరమైన సహకారం అందించడంతోపాటు భవిష్యత్తులోనూ గ్రామంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.
దాతలు ముందుకు రావాలి..
మారుమూల కొలాం గిరిజన గూడేల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు కొదవ లేదని, వారికి సరైన ప్రోత్సాహం, అవకాశాలు కల్పిస్తే ఉన్నత స్థాయికి చేరుకుంటారని అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. ఇలాంటి ప్రాంతాల్లోని పాఠశాలలను దాతలు దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం కూడా ప్రత్యేక చొరవ తీసుకుని సోనేరావు గూడెంకు రహదారి, రవాణా సౌకర్యాలు కల్పించాలని, అంగన్‌వాడీ, పాఠశాల వసతులు అందుబాటులోకి తేవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
గుట్టపై గూడెం ఉన్నా.. అక్కడి చిన్నారుల ఆశయాలు మాత్రం కొండంత ఎత్తులో ఉన్నాయి. వారికి కావాల్సింది కాస్త చేయూత.. చదువుకు భరోసా.. అభివృద్ధికి ప్రభుత్వ చొరవ!
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


