సింగరేణి భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
కొత్తగూడెం, : సింగరేణి సంస్థను కాపాడుకోవడం, లాభాల బాటలో నడిపించడం, పోటీ ప్రపంచంలో మరింత బలోపేతం చేసి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, యాజమాన్యం అందరి ఉమ్మడి బాధ్యత అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సింగరేణి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, సంస్థ భవిష్యత్తుకు అవసరమైన ప్రతి నిర్ణయానికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. శుక్రవారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఎస్‌సీసీఎల్, తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (టీఎస్‌జెన్‌కో) ఉన్నతాధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, జిల్లా కలెక్టర్ అంకిత్, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, ఎస్‌సీసీఎల్ సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్, టీఎస్‌జెన్‌కో సీఎండీ హరీష్‌తో పాటు సింగరేణి డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.సమావేశంలో ఎస్‌సీసీఎల్ సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్ సంస్థ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, బొగ్గు ఉత్పత్తి, కొత్త గనుల అభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, ఆధునిక సాంకేతికత వినియోగం, ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణకు సింగరేణి ఆత్మవంటిదని, 130 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థను కాలానుగుణంగా మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల బహిరంగ వేలం విధానాన్ని అమలు చేయడంతో ప్రైవేట్ సంస్థల నుంచి పోటీ పెరిగిందని, ఈ పరిస్థితుల్లో నాణ్యత, ఉత్పాదకత, ఆధునిక సాంకేతికత, వ్యయ నియంత్రణ ద్వారా పోటీతత్వాన్ని పెంచుకోవాలని సూచించారు. బీఎస్‌ఎన్‌ఎల్ ఉదాహరణను ప్రస్తావిస్తూ, పెరుగుతున్న పోటీని సమర్థంగా ఎదుర్కోలేక వెనుకబడిన పరిస్థితి సింగరేణికి రాకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అధికారులకు సూచించారు. జెన్‌కోతో పాటు ఇతర విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు సరఫరా చేసే బొగ్గు అత్యున్నత నాణ్యతతో ఉండాలని, బొగ్గులో మట్టి, రాళ్లు కలవకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే బొగ్గు వాషింగ్ చేపట్టి యాష్ కంటెంట్ తగ్గించాలని ఆదేశించారు. గ్రేడ్-4, గ్రేడ్-5, గ్రేడ్-6 ప్రమాణాల ప్రకారం శాస్త్రీయంగా బ్లెండింగ్ చేసి సరఫరా చేయడం ద్వారా వినియోగదారుల విశ్వాసాన్ని పెంచాలని చెప్పారు. సింగరేణి లాభాల్లో ఉంటేనే వేలాది మంది కార్మికుల కుటుంబాల భవిష్యత్తు భద్రంగా ఉంటుందని పేర్కొంటూ, సంస్థను లాభాల బాటలో నడిపించడం ప్రతి అధికారి, ఉద్యోగి, కార్మికుడి బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రతి గని స్థాయిలో చర్చలు నిర్వహించి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. గత పదేళ్లలో కొత్త బొగ్గు బ్లాకుల అభివృద్ధిలో ఆశించిన పురోగతి లేదని పేర్కొన్న ఆయన, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త బొగ్గు బ్లాకులను వేగంగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నైనీ బ్లాక్, తాడిచర్ల-2 ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, అటవీ అనుమతుల సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు.భవిష్యత్తులో సింగరేణి కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా థర్మల్ పవర్, సోలార్, పంప్డ్ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో విస్తరించాలని సూచించారు. అలాగే లిథియం, కోబాల్ట్, రేర్ ఎర్త్ మినరల్స్ వంటి క్రిటికల్ మినరల్స్ అన్వేషణ, మైనింగ్ రంగంలోకి ప్రవేశించాలని, అవసరమైతే విదేశాల్లోని మినరల్ బ్లాకుల వేలాల్లో కూడా పాల్గొనే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. సింగరేణి బోర్డు సమావేశాలు ఇకపై కేవలం పరిపాలనా అంశాలకు పరిమితం కాకుండా సంస్థ విస్తరణ, పెట్టుబడులు, సాంకేతిక ఆధునికీకరణ, దీర్ఘకాలిక అభివృద్ధి వ్యూహాలపై చర్చించే వేదికగా మారాలని, కార్పొరేట్ సంస్థల తరహాలో స్పష్టమైన లక్ష్యాలు, కాలపట్టికతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుల అమలులో జాప్యానికి తావు లేకుండా పెండింగ్ అంశాలను ప్రత్యేక కార్యాచరణతో పరిష్కరించాలని, శాఖల మధ్య సమన్వయంతో నిర్ణీత గడువులో లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. ఎల్-నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని కూడా అధికారులను ఆదేశించారు. తెలంగాణలో అత్యధిక ఆదాయం ఆర్జించే ప్రభుత్వ రంగ సంస్థగా సింగరేణిని మరింత అభివృద్ధి చేసి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే సంస్థగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ఉద్యోగులు, కార్మికులు సమిష్టిగా కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
Views: 38
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Jul 2026 18:44:48
దౌల్తాబాద్ (సిద్ధిపేట్): మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ఏకరూప దుస్తులను మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
