ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్ర
- రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది.
- లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం..
- నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి..
- నీలం మధు ముదిరాజ్
పటాన్ చెరు (సంగారెడ్డి): దేశంలో ప్రజాస్వామ్యాన్ని పూడ్చిపెట్టి, ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర కుట్రలు చేస్తోందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ నీలం మధు ముదిరాజ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల తరఫున నిలబడి కేంద్రాన్ని నిలదీస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజాదరణను చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని, అందులో భాగంగానే ఆయనతో పాటు ప్రతిపక్ష నేతలను అక్రమంగా అరెస్ట్ చేయిస్తోందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ తో పాటు ప్రతిపక్ష నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ, నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ఏఐసీసీ పిలుపు మేరకు, టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన ‘చలో లోక్ భవన్’ నిరసన కార్యక్రమంలో నీలం మధు ముదిరాజ్ పాల్గొని మాట్లాడారు. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరమ్మ విగ్రహం వద్దకు వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు యువతతో కలిసి ఆయన రాజ్ భవన్ వైపు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ.. రాత్రింబవళ్లు కష్టపడి చదివిన లక్షలాది మంది నిరుపేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ ప్రభుత్వం దారుణంగా చెలగాటమాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా నీట్ పేపర్ లీకేజీ కుంభకోణంతో విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టారని విమర్శించారు. ఈ దారుణమైన వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కక్షసాధింపు చర్యలతో ప్రతిపక్ష నాయకులను జైలుకు పంపినంత మాత్రాన కాంగ్రెస్ పోరాటాలను ఆపలేరని స్పష్టం చేశారు. విద్యార్థుల, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న బీజేపీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో దేశ ప్రజలు, యువత తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, వీర్లపల్లి శంకర్, అంబర్ పేట్ ఇంచార్జీ డాక్టర్ సి రోహిన్ రెడ్డి, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్, డీసీసీ అధ్యక్షులు మోత రోహిత్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ , ఎన్ఎస్ యుఐ శ్రేణులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు భారీగా పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


