‘హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం

చేనేత రంగంలో ఆవిష్కరణలు, సాంకేతికత ఆధారిత పరిష్కారాలను ప్రోత్సహించేందుకు ‘హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం

‘హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం

ఆగస్టు 1, 2026న వైభవంగా ముగింపు వేడుక... ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు 20 జూలై చివరి తేదీ

భారతదేశ చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ పరిధిలోని అభివృద్ధి కమిషనర్ (చేనేత) కార్యాలయం హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2026-‘‘వీవింగ్ ఇన్నోవేషన్’’ పేరుతో ఒక జాతీయ స్థాయి పోటీని ప్రారంభించింది. సాంకేతికత, సరికొత్త డిజైన్లు, పారిశ్రామిక నైపుణ్యం, పర్యావరణ హిత పరిష్కారాలను చేనేత రంగానికి అనుసంధానించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ హ్యాకథాన్ ముగింపు వేడుక (గ్రాండ్ ఫినాలే) ఆగస్టు 1, 2026న ఐఐటీ ఢిల్లీలోని ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ (ఎఫ్ఐటీటీ) వేదికగా జరగనుంది. ప్రాథమిక పరిశీలనలో ఎంపికైన జట్లు తమ ఆలోచనలను, పరిష్కారాలను ఇక్కడ ప్రదర్శిస్తాయి. విద్యా రంగం, పరిశ్రమలు, డిజైన్, సాంకేతికత, చేనేత రంగ నిపుణులతో కూడిన ఒక ఉన్నత స్థాయి జ్యూరీ ఈ ప్రదర్శనలను పరిశీలించి విజేతలను ఎంపిక చేస్తుంది. 

ఈ కార్యక్రమం గురించి కేంద్ర జౌళి శాఖ చేనేత విభాగం అభివృద్ధి కమిషనర్ డాక్టర్ ఎం బీనా మాట్లాడుతూ... 

‘‘భారతీయ యువత సృజనాత్మకతను, చేనేత రంగ సంప్రదాయ వారసత్వాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడమే ‘హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2026’ ముఖ్య ఉద్దేశం. నేత కార్మికులు, విద్యార్థులు, డిజైనర్లు, సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలు, ఆవిష్కర్తలు కలిసికట్టుగా పనిచేసేందుకు ఈ కార్యక్రమం ఒక వేదికను అందిస్తుంది. చేనేత రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లను అధిగమించడానికి, అంతర్జాతీయ పోటీని తట్టుకోవడానికి, ఈ రంగం స్థిరమైన వృద్ధి సాధించడానికి అవసరమైన ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొనడమే ఈ హ్యాకథాన్ లక్ష్యం’’.

చేనేత రంగానికి సంబంధించిన విస్తృతమైన అంశాల్లో వినూత్న పరిష్కారాలను ప్రోత్సహించేలా ఈ హ్యాకథాన్‌ను రూపొందించారు. ఉత్పత్తి, డిజైన్ ఆవిష్కరణల, సుస్థిరత, సర్క్యులారిటీ, డిజిటల్ సాంకేతికత, మార్కెట్ అవకాశాలు, బ్రాండింగ్, సరఫరా వ్యవస్థ  సమర్థత, ఉత్పాదకత పెంపు, వ్యాపార వృద్ధి, సామాజిక ప్రభావం వంటి పలు అంశాలపై ఇందులో ప్రధానంగా దృష్టి పెడతారు. 

సంప్రదాయ చేనేత రంగాన్ని దేశ ఆధునిక అంకుర సంస్థల వ్యవస్థతో మరింత బలోపేతంగా అనుసంధానించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. విభిన్న రంగాల నిపుణులు కలిసికట్టుగా సమస్యలను పరిష్కరించేందుకు ఇది మార్గం సుగమం చేస్తుంది. 

ఈ జాతీయ స్థాయి పోటీలో పాల్గొనేందుకు విభిన్న రంగాల వారికి అవకాశం కల్పించారు. జైళి, ఫ్యాషన్, డిజైన్, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, సాంకేతికత విభాగాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. వీరితో పాటు చేనేత కార్మికులు, కళాకారులు, పరిశోధకులు, అంకుర సంస్థలు, పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, రకరకాల నిపుణులు ఈ సవాల్‌లో భాగస్వాములు అయ్యేందుకు అర్హులు. 

ఈ హ్యాకథాన్ కేవలం ఉత్తమ ఆలోచనలను గుర్తించడానికే పరిమితం కాలేదు. నిజ జీవితంలో అమలు చేయడానికి వీలుగా ఉండే అచరణీయమైన పరిష్కారాలను ఇది ఎంపిక చేస్తుంది. భాగస్వామ్య సంస్థల సహకారంతో వీటికి మార్గదర్శకత్వం, ఇంక్యుబేషన్, తదుపరి అభివృద్ధికి అవసరమైన పూర్తి మద్దతును అందిస్తారు. చేనేత రంగాన్ని ఆధునీకరించడం, అంతర్జాతీయ పోటీకి సిద్ధం చేయడం, దీర్ఘకాలిక మనుగడ సాగించేలా వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం అసలు లక్ష్యం. 

ఈ పోటీలో పాల్గొనడానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు జూలై 20, 2026 వరకు తెరిచి ఉంటాయి. విద్యార్థులు, ఆవిష్కర్తలు, అంకుర సంస్థలు, పరిశోధకులు, డిజైనర్లు, పారిశ్రామికవేత్తలు, చేనేత నిపుణులు తమ వినూత్న ఆలోచనలను www.youthideathon.in/handloom వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. 

సాంకేతికంగా బలోపేతమైన, పర్యావరణ హితమైన, అంతర్జాతీయ స్థాయి పోటీని తట్టుకోగల భారతీయ చేనేత రంగం కోసం ప్రతిభావంతులంతా ఈ హ్యాకథాన్‌లో పాల్గొనాలని అభివృద్ధి కమిషనర్ (చేనేత) కార్యాలయం పిలుపునిచ్చింది. ఈ రంగంలో వినూత్న మార్పులు తీసుకువచ్చేందుకు విద్యార్థులు, ఆవిష్కర్తలు, డిజైనర్లు, పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు, అంకుర సంస్థలు, చేనేత నిపుణులు తమ వంతు కృషి చేయాలని కోరింది. 

భారత ప్రభుత్వ జైళి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈ కార్యాలయం దేశంలో చేనేత రంగానికి సంబంధించిన ప్రచారం, అభివృద్ధి, కార్మికుల సంక్షేమాన్ని నిర్వహించే అత్యున్నత సంస్థ. ప్రభుత్వ విధానాల రూపకల్పన, అభివృద్ధి కార్యక్రమాలు, మార్కెటింగ్ ప్రోత్సాహక, సంస్థాగత మద్దతు ద్వారా భారతీయ చేనేత వస్త్రాల పోటీతత్వాన్ని పెంచడానికి ఇది నిరంతరం కృషి చేస్తుంది. నేత కార్మికుల జీవనోపాధిని మెరుగుపరుస్తూ.. దేశ సంపన్న నేత సంప్రదాయాలను, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తోంది.

 

Views: 2

About The Author

Tags:
Error on ReusableComponentWidget

Latest News

హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎగుమతుల కంటైనర్లు ప్రారంభం హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎగుమతుల కంటైనర్లు ప్రారంభం
హైదరాబాద్‌: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
కోట మైసమ్మ ఆలయంలో బహిరంగ వేలం
సింగరేణిలో మెగా వృక్షారోపణ కార్యక్రమం
‘హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం
ఇల్లందు–బొమ్మనపల్లి మార్గంలో ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత
ఆనెగుంట సర్పంచ్‌కు డీపీఓ షోకాజ్ నోటీసులు
ఏకలవ్య పాఠశాలలో ఆరోగ్య శిబిరం