సింగరేణిలో మెగా వృక్షారోపణ కార్యక్రమం
కొత్తగూడెం: కేంద్ర బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో మంగళవారం సంస్థ వ్యాప్తంగా మెగా వృక్షారోపణ (మెగా ప్లాంటేషన్) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. "ఏక్ పేడ్ మా కే నామ్" నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఒక్కరోజే 50 వేల మొక్కలను నాటే లక్ష్యాన్ని అమలు చేశారు.కొత్తగూడెంలోని ఇల్లందు బంగ్లాస్ ప్రాంగణంలో ఎన్విరాన్‌మెంట్ అండ్ ఫారెస్ట్ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి. సూర్యనారాయణ, డైరెక్టర్ (ఈ&ఎం) ఎం. తిరుమలరావు, జీఎం (సీపీపీ) ఏ. మనోహర్ ముఖ్య అతిథులుగా పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డా. బుద్ధ ప్రకాష్ జ్యోతి, ఐఏఎస్ ఆదేశాల మేరకు సంస్థ పరిధిలోని ఖాళీ ప్రదేశాలు, ఓపెన్‌కాస్ట్ గనుల ఓవర్‌బర్డెన్ డంపులు, కాలనీల్లో విస్తృత స్థాయిలో మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు.బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా పర్యావరణ పరిరక్షణలో కూడా సింగరేణి దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలునాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా చేపట్టాలని పిలుపునిచ్చారు. హరితీకరణ, గని ప్రాంతాల పునరుద్ధరణ, నీటి సంరక్షణ, పునరుత్పాదక ఇంధన వినియోగం, కాలుష్య నియంత్రణ చర్యల ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సింగరేణి కట్టుబడి పనిచేస్తోందని వివరించారు.అనంతరం ఇల్లందు గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో 200 వివిధ రకాల పండ్ల మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో జీఎంలు సీహెచ్. వెంకటరమణ (ఆర్&డి), టి. లక్ష్మిపతి గౌడ్ (ఎస్టేట్), ఎన్. రాఘవేంద్రరావు (సర్వే), సీహెచ్. మురళీధర్ (ఎఫ్&ఏ), ఎన్విరాన్‌మెంట్ అండ్ ఫారెస్ట్ విభాగం అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


