ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలు

ఐదుగురు సిబ్బందికి రివార్డులు అందజేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
నేరాల నియంత్రణలో ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా పనిచేయాలి
ఆదిలాబాద్ బ్యూరో : నేరాల నియంత్రణలో భాగంగా ప్రతిభ కనబరిచి నిందితులను పట్టుకోవడంతో పాటు దొంగిలించిన వస్తువులను రికవరీ చేసిన ఐదుగురు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించి నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో మొబైల్ ఫోన్ల దొంగతనాలను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం తనిఖీల్లో సంజయ్ నగర్‌కు చెందిన సయ్యద్ అజీజ్ అనే నిందితుడి వద్ద మూడు మొబైల్ ఫోన్లు లభించగా, వాటిని రికవరీ చేసి కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ప్రతిభ కనబరిచిన జె. రమేష్, పి. రాహుల్, కిషోర్ కుమార్‌లను ఎస్పీ అభినందించారు.

కృషి చేసిన సిబ్బందికి తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది
అదేవిధంగా ఆదిలాబాద్ బస్టాండ్‌లో బస్సు ఎక్కుతున్న వ్యక్తి వద్ద నుంచి పర్సు దొంగిలించేందుకు ప్రయత్నించిన జైనథ్‌కు చెందిన సునీల్ బంసోడెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న స్పెషల్ పార్టీ సిబ్బంది ఎస్. రాకేష్‌ను, రిమ్స్ ఆసుపత్రి వద్ద మరొకరి వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను తన వాహనానికి ఉపయోగిస్తున్న ఉన్కేశ్వర్‌ను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ జి. వికాస్‌ను ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది విధుల పట్ల అంకితభావంతో, అప్రమత్తంగా పనిచేస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. సమర్థవంతంగా పనిచేసి మంచి ఫలితాలు సాధించే సిబ్బందికి తగిన గుర్తింపు, ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


