న్యాయం కోసం వస్తే చావును కోరిన అధికారి..!
- గజ్వేల్ ఎమ్మార్వో నిర్వాకంపై నిరసనల జ్వాలలు!

- అధికారి తీరుపై రైతు ప్రతినిధుల ఆగ్రహం
సిద్దిపేట జిల్లా / గజ్వేల్ : వ్యవసాయ భూమి సమస్యతో తీవ్ర మానసిక ఆందోళన చెందుతూ న్యాయం కోసం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఒక రైతు పట్ల సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మార్వో అత్యంత నిర్లక్ష్యంగా, అవహేళనగా వ్యవహరించడం కలకలం రేపుతోన్న వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ల్యాండ్ సమస్య పరిష్కారం కోసం అధికారిని ఆశ్రయించిన రైతుతో మాట్లాడే క్రమంలో ఎమ్మార్వో, “నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా.. బతికే ఉన్నావా?” అంటూ దారుణమైన రీతిలో వ్యాఖ్యానించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆవేదనతో ఉన్న రైతు “నా పరిస్థితి చూసి నవ్వుతారా?” అని ప్రశ్నించగా, “అవును.. నవ్వు వస్తది, బరాబర్ వస్తది” అని బాధ్యతారాహిత్యంగా బదులిచ్చినట్లు తెలిసింది. సాగుభూమి సమస్యలతో సతమతమవుతున్న రైతులకు కొండంత అండగా నిలవాల్సిన బాధ్యతాయుతమైన అధికారి స్థానంలో ఉండి, ఇలాంటి నిర్దయగా మాట్లాడటం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోనే రైతుకు ఇలాంటి చేదు అనుభవం ఎదురుకావడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, రైతు ప్రతినిధులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాల్సిన అధికారులే ప్రాణాలు తీసుకునేలా ప్రేరేపించేలా మాట్లాడటం శోచనీయమని పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


