దసరా సెలవుల్లో ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్.

భూపాలపల్లి : రానున్న దసరా పండుగ సెలవుల నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రజలు పెద్ద సంఖ్యలో తమ స్వగ్రామాలకు, బంధువుల ఇళ్లకు ప్రయాణాలు చేయనున్నందున, ఖాళీగా ఉండే ఇళ్లలో దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, దసరా పండుగను దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, కాలనీలు, ఒంటరిగా ఉన్న ఇళ్ల పరిసరాల్లో పోలీస్ గస్తీని మరింత పటిష్టం చేసినట్లు తెలిపారు. రాత్రి వేళల్లో ప్రత్యేక మొబైల్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ, బీట్ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసి, అనుమానాస్పద వ్యక్తులు, కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ప్రజలు ప్రయాణానికి వెళ్లే ముందు ఇళ్లకు బలమైన తాళాలు వేసుకోవాలని, విలువైన వస్తువులు, నగదు, బంగారం వంటి వాటిని ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు. అలాగే, తాము ఊరికి వెళ్తున్న విషయాన్ని నమ్మకమైన పొరుగువారికి, గ్రామ పెద్దలకు తెలియజేయడంతో పాటు, అవసరమైతే స్థానిక పోలీస్ స్టేషన్‌కు ముందుగానే సమాచారం అందించాలని తెలిపారు.
దసరా సెలవుల సమయంలో దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, ద్విచక్ర వాహనాల చోరీలు, ఇళ్లలోకి చొరబడి నేరాలకు పాల్పడే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. గతంలో నేరాలు నమోదైన ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు, పోలీస్ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. ప్రజలు తమ ఇళ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ముందుగానే తనిఖీ చేసుకోవాలని, ఇంటి తాళాల వివరాలు, ప్రయాణ వివరాలను సామాజిక మాధ్యమాల్లో బహిరంగంగా వెల్లడించవద్దని సూచించారు. అపరిచిత వ్యక్తుల కదలికలు లేదా అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రాధాన్యత. పండుగ సెలవులను సురక్షితంగా జరుపుకోవడానికి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ శ్రీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


