బెదిరింపులకు పాల్పడిన కేసులో ఒకరు, హోటల్‌లో చోరీకి పాల్పడిన మరో వ్యక్తి అరెస్ట్
వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రెండు వేరువేరు ఘటనల్లో ఇద్దరు అరెస్ట్ రిపోర్టర్ పేరుతో డబ్బులు డిమాండ్ చేసిన ముగ్గురు నిందితులు, – వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ బి. సునీల్ కుమార్
ఆదిలాబాద్ బ్యూరో అక్టోబర్ 19 (విజన్ ఆంధ్ర)ఆదిలాబాద్ పట్టణంలో బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించిన కేసులో ఒకరిని, హోటల్‌లో చోరీకి పాల్పడిన మరో వ్యక్తిని ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నేరాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ బి. సునీల్ కుమార్ తెలిపారు.కేసు – 1: ఒక రిపోర్టర్ పేరుతో బెదిరింపులు జల్సాలకు అలవాటు పడి, తమ సంపాదన సరిపోక డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దీపాయిగూడ గ్రామానికి చెందిన రాకేశ్, ఏనుగంటి రమాకాంత్, కుషన్‌పల్లి స్వామి ముగ్గురు కలిసి ఒక వ్యక్తిని బెదిరించి డబ్బులు వసూలు చేయాలని పథకం రూపొందించారు. ఈ క్రమంలో అక్టోబర్ 7న కుషన్‌పల్లి స్వామి ఫోన్ నుంచి దుర్గం శేఖర్‌కు ఫోన్ చేసి, తాను ఒక రిపోర్టర్‌నని పరిచయం చేసుకుంటూ రూ.20,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే అతని వివరాలను బయటపెట్టి చెడుగా ప్రచారం చేస్తామని బెదిరించారు. అనంతరం దుర్గం శేఖర్ ఆ రిపోర్టర్ తో కాన్ఫరెన్స్ కాల్‌లోకి తీసుకురావడంతో నిందితుల వ్యవహారం బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే స్వామి, రమాకాంత్‌లను అదుపులోకి తీసుకోగా, పరారీలో ఉన్న రాకేశ్‌ను ఆదిలాబాద్‌లో గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడు నేరానికి ఉపయోగించిన లావా కంపెనీకి చెందిన మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు – 2: ఆదిలాబాద్ బిర్యానీ హోటల్‌లో చోరీ ఆదిలాబాద్ పట్టణంలోని మసూద్ చౌక్ వద్ద ఉన్న ఆదిలాబాద్ బిర్యానీ హోటల్‌లో 17 తెల్లవారుజామున సుమారు 4:30 గంటల సమయంలో షట్టర్‌కు తాళం వేసి ఉండటాన్ని గమనించిన నిందితుడు షైక్ తబ్రిజ్, హోటల్ వెనుకవైపు ఉన్న తలుపు తాళాన్ని రాయితో పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు. అనంతరం కౌంటర్, చిన్న గల్లాపెట్టె తాళాలను కూడా పగలగొట్టి అందులోని నగదును చోరీ చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. చోరీ చేసిన డబ్బులను తన అవసరాలకు, జల్సాలకు ఖర్చు చేసిన నిందితుడు, మిగిలిన నగదుతో మరో చోరీకి పాల్పడేందుకు 18న రాత్రి నేతాజీ చౌక్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా వన్ టౌన్ పోలీసులకు పట్టుబడ్డాడు. విచారణలో హోటల్‌లో చోరీ చేసినట్లు అంగీకరించగా, అతని వద్ద మిగిలిన రూ.400 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ బి. సునీల్ కుమార్ మాట్లాడుతూ, ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేయడం, దొంగతనాలకు పాల్పడడం వంటి నేరాలకు పాల్పడేవారిని ఉపేక్షించబోమని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా నేరాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


