దసరా పండుగ వేళ సొంతగ్రామం కొండారెడ్డిపల్లెకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాక - ఘన స్వాగతానికి ఏర్పాట్లు
నాగర్‌కర్నూల్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేడు నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లెలో పర్యటించనున్నారు. దసరా పండుగ వేళ సొంత గ్రామానికి వస్తుండటంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి రాక సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు, గ్రామస్తులు, అధికారులు ఘన స్వాగతానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం కొండారెడ్డిపల్లెలోని తన ఇలవేల్పు అయిన శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం తన స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం తన నివాసంలో జిల్లాకు చెందిన ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, జిల్లా ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. జిల్లా అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై చర్చించనున్నట్లు సమాచారం. సాయంత్రం గ్రామంలోని మైసమ్మ ఆలయం, జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేసి, అనంతరం హనుమాన్ ఆలయ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారు.
సీఎం షెడ్యూల్ వివరాలు:
ఉదయం 11:20 గంటలకు హైదరాబాద్‌లోని ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డి. ఇన్‌స్టిట్యూట్‌లోని నివాసం నుంచి హెలిప్యాడ్‌కు బయలుదేరి, 11:30 గంటలకు హెలికాప్టర్‌లో నాగర్‌కర్నూల్‌కు బయలుదేరతారు. మధ్యాహ్నం 12 గంటలకు కొండారెడ్డిపల్లెకు చేరుకుని, 12:15 నుంచి 12:45 వరకు ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు భోజనం అనంతరం అధికారులతో భేటీ అవుతారు. సాయంత్రం 6 గంటలకు మైసమ్మ ఆలయ పూజలు, 6:45కు ప్రజలతో ముఖాముఖి అనంతరం రాత్రి 7 గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమై, 8:30 గంటలకు జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


